చుక్కాని లేని నావాల మారిందా..?
దిశ దశ, కరీంనగర్:
షోకాజ్ నోటీసుల నుండి ప్రత్యక్ష్య పోరు వరకు చేరుకుంది కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పంచాయితీ. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చినా కలిసిపోవడం కంటే కలహాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఉంది. అంతర్గత ప్రజాస్వామ్యం తమ పార్టీలో ఎక్కువగా ఉంటుందని బాహాటంగానే చెప్పుకునే కాంగ్రెస్ నేతలు బహిరంగంగా జరిగిన బాహాబాహికి ఎలా సర్దుకుని చెప్పుకుంటారోనన్న చర్చ జరుగుతోంది. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ ముందే జరిగిన ఈ రచ్చ రచ్చకు పుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చొరవ తీసుకుంటుందా… ఇలాగే వదిలేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
గతంలో…
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావాలా మారిపోయింది. పెద్ద దిక్కు లేకుండా పోవడంతో అంతర్గత పోరు బహిర్గతం అయింది. కరీంనగర్ నాయకుల మధ్య ఏర్పడిన అంతరం దృష్ట్యా గతంలోనే పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇచ్చిన తరువాత సంతృప్తి చెందినట్టుగానే వ్యవహరించింది. అయితే అంత్య నిష్టూరం కన్న ఆది నిష్టూరమే మేలన్న నానుడిని దృష్టిలో పెట్టుకుని అప్పుడే దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టయితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలోనే పార్టీ శ్రేణులతో పార్టీ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ నిర్వహించిన సమావేశంలో కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చిన పీసీసీ క్రమశిక్షణా కమిటీ కరీంనగర్ నేతల మధ్య నెలకొన్న విబేధాలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడయినా నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు చొరవ తీసుకునేందుకు పీసీసీ పెద్దలు సాహసించకపోవడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసహనం ఏఐసీసీ కార్యదర్శి ముందు వెళ్లగక్కేలా చేసిందా అన్న చర్చ కూడా జరుగుతోంది.
తాజాగా…
సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ పెరుమాళ్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, వేరే నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులు కెటాయిస్తున్నా కరీంనగర్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా వైద్యుల అంజన్ కుమార్ పేరును ప్రతిపాదించి జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపిస్తే ఈ మేరకు జరగాల్సిన ప్రక్రియ అంతా పూర్తయినా చివరి క్షణలో ఉత్తర్వులు రాకుండా నిలువరించారని ఆరోపించారు. అంతేకాకుండా జిల్లా గ్రంథాలయ సంస్థ, సుడాలకు ఛైర్మన్లను నియమించినప్పటికీ డైరక్టర్లను మాత్రం ఎంపిక చేయలేదని పురుమళ్ల వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం ఒక్కసారిగా శ్రీనివాస్ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో చేయి కూడా చేసుకున్నారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆ గందరగోళంలో అసలేం జరిగింది అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. అటు పురుమళ్ల శ్రీనివాస్ వర్గీయులు, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుల మధ్య నెలకొన్న ఈ ఘటన సర్వత్రా చర్చకు దారి తీసింది.
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర…
మరో వైపున నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నేతృత్వంలో కరీంనగర్ లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. సాయంత్రం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నగర వీధుల మీదుగా సాగింది. అటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో పాదయాత్ర నిర్వహించినప్పటికీ… కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరును కట్టడి చేసేందుకు ప్రయత్నించలేకపోతోందన్న విమర్శలు కూడా ఎదుర్కొవలసి వచ్చింది.
చెక్ పెడుతుందా..?
బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యవహరించిన తీరుపై పీసీసీ అధిష్టానం చొరవ తీసుకుని విబేధాలకు, అభిప్రాయ బేధాలకు చెక్ పెడుతుందా లేదా అన్న మీమాంసలో పార్టీ శ్రేణులు కొట్టు మిట్టాడుతున్నారు. పదవుల పందేరమే అయినా, పార్టీని వెన్నంటి ఉన్న వారికి ప్రాదాన్యత కల్పించే విషయమే అయినా ఇలా అన్నింటా సమ న్యాయం పాటించాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని జిల్లా పార్టీ శ్రేణులకు, బాధ్యులకు చెప్పాల్సిన అవసరం అయితే ఉందని సోమవారం నాటి రగడ స్పష్టం చేస్తోంది. ప్రధానంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పుదు పార్టీ వ్యవహారాలను, ముఖ్య కార్యకర్తలను గుర్తించడంతో పాటు పార్టీని గాడిలో పెట్టే బాధ్యతలను సీనియర్ నేతకు అప్పగిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి పోటీ చేసి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో హుస్నాబాద్ నియోజకవర్గం విస్తరించి ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేసిన వారిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నుండి ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆయన నియోజకవర్గం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. సుదీర్ఘ కాలం డీసీసీ అధ్యక్షునిగా పని చేసిన కటుకం మృత్యుంజయం సొంత ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేరింది. మరో డీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన టి సంతోష్ కుమార్ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి తిరిగి సొంత గూటికి వచ్చారు. ఇటీవల కాలంలో సంతోష్ కుమార్ పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే నడుచుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా పరిస్థితులపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న ముఖ్య నేతలంతా కూడ ఇతర జిల్లాలకే పరిమితం కావల్సిన పరిస్తితి ఏర్పడగా, మంత్రి పొన్నం ప్రబాకర్ మాత్రమే ఈ జిల్లాతో అనుభందం పెనవేసుకుని ఉన్నారు. అయితే పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్ నేతలకు అప్పగించి దిద్దుబాటు చర్యలు తీసుకోనట్టయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. ఇది రానున్న ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించనట్టయితే ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తోందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.