రామగుండంలో వాయుగుండం

బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు

కొరుకంటికి కొరకరాని కొయ్యలు…

దిశ దశ, పెద్దపల్లి:

ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిపైనే అసమ్మతి రాజుకుంది. అస్మదీయులుగా ఉండాల్సిన సహచర ఉద్యమకారులంతా జట్టుకట్టి కాలుదువ్వారు. మొదట్లో టీ కప్పులో తుపానులాంటిదేనని అనుకున్నా ఇప్పుడది ప్రళయంలా మారిపోయింది. పార్టీకి, ప్రభుత్వానికి పెద్దన్న పాత్ర పాత్ర పోషిస్తున్న మంత్రి కేటీఆర్ వద్దకు పంచాయితీ చేరడం ఓ తలనొప్పి అనుకుంటే మరో మంత్రి వారికి అండగా నిలబడం ఝటిలంగా మారిపోయిందన్న ఆందోళన నెలకొంది. రామగుండం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి వాయుగుండంగా మారినట్టే కనిపిస్తోంది.

చాపకింద నీరులా…

ఐదేళ్లుగా చాప కింద నీరులా వ్యవహరించిన అసమ్మతి అంతా ఒక్క సారిగా భగ్గుమంది. పార్టీలో కొనసాగాలంటే అభ్యర్థిని మార్చండి… తమకు ఇచ్చినా ఇవ్వకున్నా ఫర్వాలేదు…కానీ సిట్టింగ్ కు మాత్రం ఇవ్వొద్దన్న షరతు విధించడం సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై వ్యతిరేక కూటమి అంతా ఒక్కటయింది. ఇంత కాలం స్తబ్దంగా ఉంటూ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించిన వ్యతిరేకులంతా జట్టు కట్టి పావులు కదపడం ఆరంభించారు. పక్షం రోజుల క్రితమే ఒకే వేదిక మీదకు చేరిన వీరంతా కూడా తమ లక్ష్యం అంతా కూడా ప్రత్యర్థిపై పై చేయిగా నిలవాల్సిన అవసరం ఉందని… ఆ దిశగా పావులు కదపాలని నిర్ణయించారు. ఈ మేరకు అధిష్టానం వద్దకు తమకు జరిగిన అన్యాయం… ఉద్యమ ప్రస్థానం అంతా కూడా ఎకరవు పెట్టడం మొదలు పెట్టారు. వారు వేసిన వ్యూహం ఫలించడంతో అధిష్టానం కూడా వారి వాదనలను వినేందుకు ప్రత్యేకంగా సమయం కెటాయించింది. దీంతో ఒక్క సారిగా రామగుండం బీఆర్ఎస్ పార్టీలో భారీ కుదుపు మొదలైందనే చెప్పాలి.

మంత్రులతో భేటి…

రెండు రోజుల క్రితం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అసమ్మతి నేతలంతా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి లక్ష్యంగా విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు సమాయత్తం అయ్యామన్న సంకేతాలు కూడా ఇచ్చింది. చివరకు ఉమ్మడి జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి పరిస్థితిని వివరించగా ఆయన కూడా అసమ్మతి వాదులకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. చందర్ కాపాడుకోలేకపోయాడని, ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారని, వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీ కోసం పనిచేయాలంటూ ఈశ్వర్ వ్యాఖ్యానించారు. అదే రోజున మంత్రి కేటీఆర్ తో కూడా అసమ్మతి వాదులు మిర్యాల రాజిరెడ్డి, కందుల సంధ్యారాణి, కొంకటి లక్ష్మీనారాయణ, ఎల్లయ్య దంపతులు భేటీ అయి రామగుండంలో జరుగుతున్న తీరును కులంకశంగా వివరించారు. దీంతో సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్ల కెటాయింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అయినందున చందర్ తో మాట్లాడుతున్నాను కానీ ఆయన నాకు దగ్గర అని అనుకుంటే ఎలా అని మంత్రి కేటీఆర్ అసమ్మతి నాయకులతో అన్నట్టు సమాచారం. సొంత పార్టీ నేతలపై కూడా కేసులు పెట్టించారన్న విషయం తన దృష్టికి రాలేదని కూడా మంత్రి కేటీఆర్ అన్నట్టుగా సమాచారం.

ఇంఛార్జిగా కొప్పుల…

అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యవహారంలు చక్కబెట్టేందుకు రామగుండం కోసం ప్రత్యేకంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఆయన నేతృత్వంలోనే అక్కడి పరిస్థితులు సెట్ చేయాలని అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే అసమ్మతి నాయకులు పార్టీ అధిష్టానం చెప్పిన ప్రతి విషయాన్ని అంగీకరించి పార్టీకి అనుకూలంగా ఉంటామని చెప్తున్నప్పటికీ మెలిక పెట్టినట్టుగా తెలుస్తోంది. రామగుండం అభ్యర్థిని మార్చాల్సిందేనని, ఆయన స్థానంలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాము మద్దతు ఇస్తామంటూ స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో కొప్పుల ఈశ్వర్ అసమ్మతి వాదులను సముదాయించి కొరుకంటి చందర్ కు అనుకూలమైన వాతావరణం ఏర్పర్చుతారా లేక చందర్ కు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని బరిలో నిలపాలని ప్రతిపాదిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

You cannot copy content of this page