ఏకపక్ష నిర్ణయానికి వినూత్న నిరసన
ఆ నియోజకవర్గంలో నామినేషన్లకు రంగం సిద్దం
దిశ దశ, చొప్పదండి:
రెండు దశాబ్దాల క్రితం ఆ పోలీసు అధికారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఒంటిచేత్తో నడిపించారు. జిల్లా పోలీసు బాసుగా జనాలతో మమేకమయి నక్సల్స్ ఇలాకాలో తనకంటూ బ్రాండ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ పోలీసు బాసుకు అండగా నిలిచిన జిల్లాలో ఎదురీతలు మొదలయ్యాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ అక్కడి నాయకులు కినుక వహిస్తున్నారు. తాజాగా నెలకొన్న ఈ పరిణామాలు పార్టీ నిర్మాణ దశలోనే ఎదురుకావడం విశేషం.
చొప్పదండిలో…
కరీంనగర్ జిల్లా చొప్పదండి రిజర్వుడు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీకి షాక్ తగలబోతోంది. బహుజన వాదాన్ని ఎత్తుకుని తిరిగే ఆ పార్టీకి దళిత నాయకుల నుండే వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం సంచలనంగా మారింది. చొప్పదండి నియోజకవర్గంలో సీనియర్లు, గతంలో పోటీ చేసిన నాయకులను కాదని మరో అభ్యర్థిని ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం అయితే, ఆ అభ్యర్థి కూడా ఇతర నాయకులను కలుపుకుని ప్రచారంలోకి వెళ్లకపోవడం కూడా ఇక్కడి వారికి ఇబ్బందికరంగా మారింది. అభ్యర్థుల ప్రకటన జరిగిన 15 రోజులు అవుతున్నా అభిప్రాయబేధాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర నాయకత్వం కూడా పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దీంతో తమ దారి తాము చూసుకుంటే బెటర్ అని కొంతమంది భావిస్తుండగా, మరి కొంతమంది నాయకులు తటస్థంగా ఉండేందుకు మొగ్గు చూపే పరిస్థితి తయారైంది. ప్రజాక్షేత్రంలో తమ బలమేంటో చేతల్లో చూపించాలని భావిస్తున్న బీఎస్పీ పార్టీ చొప్పదండి నియోజకవర్గంలో ఎదురీదాల్సిన పరిస్థితి తయారైంది.
సీనియర్లను కాదని…
అయితే బీఎస్పీ నేత డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థిగా కొంకటి శేఖర్ పేరును ఖరారు చేశారు. అప్పటి నుండి ఇక్కడి బీఎస్పీ పార్టీలో ముసలం మొదలైంది. ఇప్పటి వరకు నియోజకవర్గానికి చెందిన 13 మంది నాయకులు బీఎస్పీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన మంద రవిందర్ ను కాదని శేఖర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల కూడా కొంత నైరాశ్యం నెలకొన్నప్పటికీ ఆయన మాత్రం బీఎస్పీతోనే అడుగులు వేస్తున్నారు. చొప్పదండి ప్రజలతో మమేకమైన రవిందర్ ను కాదని నాయకులతో సాన్నిహిత్యంగా ఉండే వారి పేరు ప్రకటించడం సరికాదన్న వాదనలు లేవనెత్తుతున్నారు ఇక్కడి బీఎస్సీ నాయకులు. ఈ క్రమంలో బూత్కూరు కాంత అనే మహిళా నాయకురాలు బీఎస్పీని వీడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చొప్పదండి నియోజకవర్గంలో ఇతర సీనియర్ నాయకులను కూడా విస్మరించారన్న ఆవేదన కూడా ఇక్కడి క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.
రె‘బెల్స్’ మోగిద్దాం
ప్రధాన పార్టీలకు ఎదురుకావల్సిన రెబెల్స్ బెడదను చొప్పదండిలో బీఎస్పీ ఎదుర్కోబోతుండడం విశేషం. కొంకటి శేఖర్ వ్యతిరేక నాయకులంతా ఏకతాటిపై నడుస్తూ ఇండిపెండెంట్ గా బరిలో నిలిచేందుకు సమాయత్తం అవుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి మండలానికి ఒక్కరు చొప్పున బీఎస్సీ రెబెల్స్ గా బరిలో నిలిచి తమ వ్యతిరేకతను నాయకత్వానికి తెలియజేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా ఖరారు చేసుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. జిల్లా ఇంఛార్జిగా పని చేసిన నల్లాల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. కల్లెపల్లి తిరుపతి, సామ్యేలు, మురళి, కాశిపాక తిరుపతిలు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసే వారి జాబితాలో ఉన్నట్టు సమాచారం. బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థి ఎంపిక విషయంలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ వైఖరిని వెలిబుచ్చేందుకు చొప్పదండి నేతలు నామినేషన్ల పర్వానికి తెరలేపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు అభ్యర్థి శేఖర్ కానీ, రాష్ట్ర నాయకత్వం కాని చొరవ తీసుకోకపోవడం కూడా వీరిని విస్మయపరుస్తోంది. దీంతో చొప్పదండి బీఎస్పీ అసమ్మతి నేతలు తాడో పేడో ఎన్నికల్లోనే తేల్చుకుందామని నిర్నయించుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్న తొలినాళ్లలోనే ఇలాంటి పరిణామాలు ఎదురు కావడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.