ఏఐఎఫ్బీ ఎన్నికల కమిటీ రద్దు… రాష్ట్ర కమిటీకే బాధ్యతలు

దిశ దశ, హైదరాబాద్:

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఎన్నికల కమిటీ రద్దు చేయడంతో పాటు ఛైర్మన్ ను కూడా బాధ్యతల నుండి తప్పించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏఐఎఫ్బీ రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింహం గుర్తుపై పోటీ చేసేందుకు ఆశావాహులు ఆసక్తి చూపుతున్న తరుణంలో పార్టీపై వస్తున్న బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చే చర్యలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం. మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ అత్యవసర సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ వి ప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో నెల రోజులుగా రాష్ట్ర పార్టీల జరుగుతున్న పరిణామాల గురించి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిటీని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కటకం మృత్యుంజయం పార్టీ విధి విధానాలు, నియమ నిభందనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది. అంతేకాకుండా రాష్ట్ర కమిటీ, ఎన్నికల కమిటీ కన్వీనర్ తో సంబంధం లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారని సమావేశంలో చర్చించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొనడంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీని రద్దు చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతరాత్ర వ్యవహారాలన్ని చక్కబెట్టే బాధ్యతలను రాష్ట్ర కమిటీకి అప్పగిస్తూ నిర్ణయించారు. అ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి, బుచ్చిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, పి కృష్ణమూర్తి, కొండ దయానంద్, నరేందర్ లు పాల్గొన్నారు.

నెల రోజుల్లోనే…

సీనియర్ నేత కటకం మృత్యుంజయం బీజేపీని వీడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించిన నెల రోజులు తిరగకముందే బాధ్యతల నుండి తప్పించడం సంచలనంగా మారింది.

You cannot copy content of this page