రాజన్న సన్నిధిలో నాన్ వెజ్ ప్యాకెట్లు…

అన్యమతస్తుల చర్యలేనంటూ ఆరోపణలు…

దిశ దశ, వేములవాడ:

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయంలోకి అన్య మతస్తులు ఎంట్రీ ఇచ్చారా..? ఆలయ ప్రాంగణంలో మాంసాహరం పంపిణీ చేసింది ఎవరూ..? ఈవో కార్యాలయంతో పాటు ధర్మ గుండం ప్రాంతంలో నాన్ వెజ్ ప్యాకెట్ల పంపిణీ చేయడం సంచలనంగా మారింది. గర్భాలయ సమీపంలోనే జరిగిన ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఘటనపై వేములవాడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ప్లాస్టిక్ డబ్బాల్లో…

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసిన నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని పంచి పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు మాంసాహారం పంచిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బాక్సులపై ఓ బాబు జన్మదిన శుభాకాంక్షలు అని రాసి ఉండగా, మరికొన్ని బాక్సులపై హ్యపి క్రిస్ మస్ అని ముద్రించి ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా అన్యమతస్తులే చేసి ఉంటారని పట్టణానికి చెందిన హిందు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. లిటిల్ స్మైలీ ఫౌండేషన్ అని కొన్ని బాక్సులపై, క్రియేటింగ్ స్మైలీ ఫౌండేషన్ అని బాక్సులపై ముద్రించి ఉండడం గమనార్హం. ఆలయ ప్రాంగణంలో దర్జాగా మాంసాహారాన్ని పంచిపెడుతుంటే కూడా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ యంత్రాంగం తరుచూ తిరుగుతూ ఉండే ప్రాంతంలోకి అన్యమతస్తులు వచ్చి మాంసాహరం పంచిపెట్టినా పట్టించుకోలేదంటే ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు.

కరుణామయుని బర్త్ డే నాడే…

క్రైస్తవ సమాజం అంతా కూడా యేసు జన్మదినం పురస్కరించుకుని జరుపుకునే క్రిస్ మస్ వేడుకలో రోజునే ఇలాంటి చర్యలకు పూనుకోవడం వెనక ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సమాజంపై కరుణ చూపించే యేసు బర్త్ డే రోజున హిందువులకు ఆగ్రహం తెప్పించే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు.

వచ్చిందెవరూ..?

అయితే బుధవారం మద్యాహ్నం జరిగినట్టుగా భావిస్తున్న మాంసాహర పంపిణీకి పూనుకున్నదెవరన్నదే ప్రశ్నార్థకంగా మారింది. బిక్షాటన చేసుకుని జీవనం సాగించే వారితో పాటు మరికొందరికి ఈ ఆహారం ప్యాకెట్లు ఇచ్చి వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణానికి వచ్చి మరీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ పంపిణీ చేయడం వెనక ఎవరు ఉన్నారన్న చర్చ కూడా మొదలైంది. గతంలో ఏనాడూ లేని విధంగా రాజన్న ఆలయంలోకి అపచార చర్యలకు పూనుకోవడం స్థానికులను విస్మయపరుస్తోంది. అయితే ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితులను గుర్తించనున్నట్టుగా తెలుస్తోంది. ఆయల ప్రాంగణంలో మాంసాహరాన్ని సరఫరా చేసిన విషయం వెలుగులోకి వచ్చిన తరువాత వాటిని అక్కడి నుండి తీసివేసిన ఆలయ ఉద్యోగులు ప్రాంగణాన్ని శుద్ది చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

You cannot copy content of this page