దిశ దశ, భూపాలపల్లి:
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ అటవీ గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకునేవి. బిక్కు బిక్కుమంటు ఆ ప్రాంత ప్రజలు కాలం వెల్లదీసేవారు. వానాకాలం ముగిసే వరకు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవనం సాగించేవారు. గోదావరి పొంగుతుందనగానే ఎవరికి వారు తట్టాబుట్టా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెల్లేవారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కూడా కావడంతో వరదలు ముంచెత్తినా అటువైపు అధికార యంత్రాంగం వెల్లేందుకు సాహసించే వారు కాదు. కానీ ఇప్పుడా పరిస్థితులకు చెక్ పడ్డట్టయింది. ఏకంగా ఉన్నతాధికారులే అడవి బిడ్డలకు భరోసా కల్పించేందుకు వెల్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల మారిన పరిస్థితులు ఇవి.
అధికారులే చిక్కుకపోయి…
రహదారులు లేక… వాగులు వంకల్లో వరద నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దిగువ గ్రామాల ప్రజలు దుర్భర జీవనం గడిపేవారు. దశాబ్దాలుగా లోతట్టు పల్లె వాసులు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. 1990వ దశాబ్దంలో కరీంనగర్ తూర్పు డివిజన్ ఫారెస్ట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామలక్ష్మి ఈ గ్రామాల్లో చిక్కుకపోయారు. 2010 ప్రాంతంలో పల్లెల్లో పరిస్థితులను పరిశీలించేందుకు వెల్లిన మంథని ఆర్డీఓ సునిత కూడా అటవీ గ్రామాల్లోనే చిక్కుకున్నారు. మరునాడు ఎడ్లబండి సహాయంతో మహదేవపూర్ కు చేరుకున్నారు. అడపాదడపా అధికారులు ఈ ప్రాంతానికి వెల్లినప్పుడు వరదల కారణంగా అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. పెద్దంపేట నుండి ముకునూరు వరకు ఉన్న గ్రామాల ప్రజలు మాత్రం తరతరాలుగా వర్షాకాలంలో ద్వీపకల్పంలో జీవనం సాగించే వారు. అడవులతో మమేకమైన అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలతో కమ్యూనికేషన్ లేకుండానే మగ్గిపోయేవారు. వర్షాకాలానికి ముందే వీరికి రేఫన్ సరుకులు పంపించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసేవారు. అటవీ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందించేందుకు మహదేవపూర్ లో ఏర్పాటు చేసిన మొబైల్ ఆసుపత్రి ద్వారా సేవలందించేందుకు యంత్రాంగం వర్షాకాలనికి ముందే ముందస్తు శిబిరాలను నిర్వహించేది. వ్యాధులు పెద్ద ఎత్తున ప్రబలిపోయాయన్న సమాచారం వస్తే మాత్రం సంచార వైద్య శాల డాక్టర్, ఫార్మసిస్ట్ తో పాటు పారా మెడికల్ సిబ్బంది అంతా కూడా కాలినడకన వెల్తూ… వాగులు వంకలు దాటుకుంటూ వెల్లేవారు. కానీ వరదల సమయంలో మాత్రం ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోయేది.
నేడు ఉన్నతాధికారులే…
అయితే అప్పటికే ఇప్పటికీ పరిస్థితిలో కొంతమేర మార్పు కనిపిస్తోంది. జలదిగ్భంధనంలో చిక్కుకున్న ఆ గ్రామాల ప్రజలకు బాసటనిచ్చేందుకు ఏకంగా జిల్లా అధికారులే పర్యటిస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల వాసులు జలదిగ్భంధనంలో చిక్కకున్నారు. దీంతో అక్కడి ప్రజలను కలిసేందుకు ఏకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలే క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం… చత్తీస్ గడ్ నుండి ప్రవహిస్తున్న ఇంద్రావతి నది గోదావరి నదిలో కలిసే దమ్మూరు గ్రామానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు రెస్క్యూ చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందానికి దిశా నిర్దేశం చేసిన కలెక్టర్, ఎస్పీలు పల్మెల మండలంలోని పలు గ్రామాల ప్రజలతో ముచ్చటించారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ను అందుబాటులో ఉంచామని ప్రజలకు వివరించారు. త్వరలోనే పలిమెల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల భవనాలతో పాటు అధికారులు నివాసం ఉండేందుకు క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు. త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో మండలంలో గిరి వికాస్ పథకం ద్వారా వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని మరికొంతమందిని నియమించాలని దమ్మూరు గ్రామ ప్రజలు కోరారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ… గోదావరి పరివాహక ప్రాంతమే కాకుండా వాగులు వంకలు కూడా ఉన్నందు పల్మెల మండల ప్రజల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పది మంది సుశిక్షుతులైన సిబ్బందిని, వాటర్ బోట్ ఏర్పాటు చేయడం జరిగిందని పరివాహ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఆపద ముంచుకొచ్చినా వారిని కాపాడేందుకు ఈ బృందం అన్ని వేళల్లో సిద్దంగా ఉంటుందని తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు శ్రద్ద చూపాలని పిలుపునిచ్చారు. పిల్లలకు మంచి విద్య అందించినప్పుడే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారమవుతామని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. వీరి వెంట కాటారం డీఎస్పీ రాంమెహన్ రెడ్డి, తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ శ్రీనివాస్, పీఆర్ డీఈఈ సాయిులు, ఎస్సైలు పవన్, తమాషా రెడ్డిలు ఉన్నారు.
కలెక్టర్, ఎస్పీల పర్యటనకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి