దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టుల చర్యలతో సరిహద్దు అటవీ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఓ వైపున మిషనరీ దగ్దం మరో వైపున ఎదురు కాల్పులు అక్కడ సాధారణంగా మారిపోయాయి. దీంతో మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ తాలుకా హిందూరు సమీపంలో రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న వాహనాలను మావోయిస్టుల దగ్దం చేశారు. అటవీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నక్సల్స్ ఈ చర్యలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరో వైపున చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో బుధవారం ఉదయం నుండి మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. చితల్ నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం, కొత్తపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఎల్ఓఎస్ దళం షెల్టర్ తీసుకుందన్న సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్లా 201బిఎన్ కు చెందిన బలగాలు నాగారం, కొత్తపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురు కావడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల షెల్టర్ జోన్ వైపు బలగాలు ఎదురు కాల్పులు జరుపుకుంటూ వెళ్లాయి. బలగాలపై కూడా నక్సల్స్ కాల్పులు జరుపుతూ సేఫ్ జోన్ లోకి వెల్లే ప్రయత్నం చేస్తున్నారని అక్కడి అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. నక్సల్స్ షెల్టర్ తీసుకున్న ప్రాంతం వైపునకు వెల్లిన పోలీసు బలగాలు మందుగుండు సామాగ్రితో పాటు ఇతరాత్ర సామాగ్రిని గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ గాయపడి ఉంటారని పోలీసు వర్గాల భావిస్తున్నాయి. అక్కడి అటవీ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసు బలగాలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని సుక్మా జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు.