కలవరపెడుతున్న కడెం ప్రాజెక్టు…

దిశ దశ, ఆదిలాబాద్:

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు అటు అధికారులను ఇటు దిగువ గ్రామాల వాసులు మళ్లీ కలవరపెడుతోంది. ఎగువ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున వచ్చి చేరిన వరద నీటితో ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల పై నుండి వరద నీరు పొంగి పొర్లుతోంది. 3.85 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 2.42 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు వదలాల్సి వస్తోంది. ప్రధానం నాలుగు జర్మన్ క్రస్ట్ గేట్లు మోరాయించడంతో అవి ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో నీరు బ్యారేజ్ గేట్ల మీదుగా ప్రవహిస్తూ దిగువ ప్రాంతాలకు వెల్లిపోతోంది. అయితే వరద మరింత తీవ్ర రూపం దాల్చితే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. గత సంవత్సరం జూన్ లో వచ్చిన అధిక వర్షాలతో కూడా ఇదే పరిస్థితి ఎదురు కాగా ఈ సారి కూడా కడెం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కడెం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డిలు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపట్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లోని 12 గ్రామాల్లోని 7 వేల మందిని పునరావస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతిని సమీక్షించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారయంత్రాంగం సర్వం సిద్దంగా ఉంది.

You cannot copy content of this page