దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర చరిత్రలోనే సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా మునిసిపల్ కమిషనర్, ఏస్ఈ, నిర్మాణ కంపెనీపై కేసు నమోదు చేయాలని హై కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మేయర్, బీఆర్ఎస్ పార్టీ నేత సర్దార్ రవిందర్ సింగ్ ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం గమనార్హం.
అసలేం జరిగిందంటే…
కరీంనగర్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ద్వారా నిధులను కెటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధుల ద్వారా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో మాత్రమే అభివృద్ది పనులు చేపట్టవలసి ఉన్నది. కానీ అధికారులు కార్పొరేషన్ కు సంబంధం లేని చోట నిర్మాణానికి నిధులు కెటాచించడం వివాదస్పదం అయింది. కరీంనగర్ బల్దియాకు సంబంధం లేని బొమ్మకల్ కూడలి అభివృధ్ది కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 8, 2022న టెండర్లకు కూడా ఆహ్వానించారు. స్మార్ట్ సిటీ ద్వారా కెటాయించిన నిధులు బల్దియా పరిధిలోనే వెచ్చించాల్సి ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్దంగా అధికారులు బొమ్మకల్ జంక్షన్ అభివృద్ది కోసం నిధులు కెటాయించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ వన్ టౌన్ పోలీసులకు జులై 3 2024న ఫిర్యాదు చేసి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అయితే పోలీసు అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడంతో సర్దార్ రవిందర్ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డబ్లు.పి. నంబర్ 24150 ఆఫ్ 2024 ద్వారా హైకోర్టును ఆశ్రయించిన రవిందర్ సింగ్ సహజ న్యాయసూత్రాలు, రాజ్యంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించారని వివరించారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐని ఆధేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు క్రైం నంబర్ 480/2024 సెక్షన్ 420, 406 r/w 34 IPC ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్న కరీంనగర్ మునిసిపల్ కమిషనర్, ఈ పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ఎస్ఈ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ మేనిజింగ్ డైరక్టర్ తో పాటు మిగతా బాధ్యులపై కేసు నమోదు చేశారు.
ప్రైవేటు వ్యక్తుల ఫిర్యాదుతో…
సాధారణంగా అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదు చేసిన సందర్భంలో మాత్రమే ఎఫ్ఐఆర్ జారీ అయిన సందర్బాలు ఉన్నాయి. కానీ సాధారణ వ్యక్తులు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరిన సందర్భాలు కానీ, ప్రైవేటు వ్యక్తులు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సందర్భాలు కానీ ఇంతవరకు జరగలేదు. ప్రభుత్వంతో సంబంధం లేని వారు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఈ మేరకు ఎఫ్ఐఆర్ జారీ అయింది.