దిశ దశ, హుజురాబాద్:
అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడిందో లేక… ఆత్మహత్యాయత్నానికే పాల్పడిందో తెలియదు కానీ ఓ వృద్దురాలు చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడింది. తుది శ్వాస వదిలేస్తున్న క్రమంలోనే ఓ దివ్యాంగుడు ఆమెను కాపాడాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన గడ్డం మల్లమ్మ(80) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమీపంలోనే ఓ ఇంట్లో ఉంటున్న బండారి రవిందర్ అనే దివ్యాంగుని భార్య వృద్దురాలిని గమనించింది. అప్పుడే అక్కడ కూర్చొని ఉన్న వృద్దురాలి కనిపించడం లేదని బావిలో జారిపడిపోయి ఉంటుందని తన భర్తకు సమాచారం ఇచ్చింది. వెంటనే బావి వద్దకు చేరుకున్న రవిందర్ వృద్దురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని గమనించాడు. బావిలోకి దిగిన రవిందర్ బావిలోకి దిగి వృద్దురాలిని సేవ్ చేసి తన కాళ్లపై ఆమె తల పెట్టి కరెంటు మోటర్ బెల్టు సాయంతో నీటిలోని ఉండిపోయాడు. 20 నిమిషాల పాటు ఆమెను అలాగే కాపాడిన క్రమంలో ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని వృద్దురాలిని తాళ్ల సాయంతో బయటకు తీశారు. చికిత్స కోసం వెంటనే ఆమెను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. మల్లమ్మను కాపాడేందుకు సాహసించిన రవిందర్ ను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. అయితే ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.