chhattisgarh Odisha Maoist: కుల్హారిఘాట్ అడవుల్లో గాలింపు కొనసాగుతోందా..?

మరో అగ్రనేత ప్రమోద్ మృతి

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్, ఒడిషా సరిహధ్దు అడవుల్లో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో పోలీసుల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 21వ తేదిన కూడా అక్కడ ఓ సారి ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తున్న ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రా రెడ్డి అలియాస్ చలపతి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చలపతికి కేర్ టేకర్ గా, రక్షణ వలయంగా ఉన్న పలువురు మావోయిస్టులు మరణించారు. ఇప్పటికే 14 మృత దేహాలను చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ కు తరలించిన పోలీసులు కుల్హారిఘాట్ అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం కూడా మరో రెండు మృత దేహాలను బలగాలు గుర్తించడంతో పాటు అక్కడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ కోసం కూడా అన్వేషణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. చత్తీస్ గడ్ లోని గరియాబంద్ జిల్లా పరిధిలో ఉన్న ఈ అటవీ ప్రాంతం ఒడిషా రాష్ట్ర కమిటీ పరిధిలో ఉంది. ఈ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ ప్రాంతంలో 20కిపైగా మావోయిస్టులు మరణించారన్న ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలు బయటపడ్డాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో బలగాలు మిగతా వారి ఆచూకి కోసం గాలిస్తున్న క్రమంలో మరో రెండు శవాలను గుర్లించారు. DKSZC సభ్యుడు, ఈస్ట్ జోనల్ బ్యూరో ఇంఛార్జి ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ అలియాస్ పాండుగా ఒక మృతదేహాన్ని గుర్తించినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ప్రమోద 1985లో విప్లవ పంథ వైపు పయనం అయ్యారని మొదట ప్రజా యుద్ద నౌక గద్దర్, సంజీవ్ లతో కలిసి జన నాట్యమండలిలో పని చేసినట్టుగా తెలుస్తోంది. ఇతనిపై రూ. 20 లక్షల రివార్డు ఉన్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు.

మాడ్ ఏరియాలో…

చత్తీస్ గడ్ లోని మాడ్ ఏరియాలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పాండు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది. మాడ్ ఏరియా ప్రజల ఆహార అలవాట్లతో ఏ మాత్రం సంబంధం లేని పాండూ అక్కడి అటవీ ప్రాంతలో పార్టీని నిర్మించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ధాన్యం అంటేనే తెలియని మాడ్ ఏరియాలో విప్లవాలను పరిచయం చేసేందుకు ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన చంద్రహాస్ నాలుగు దశాబ్దాలుగా అడవులతోనే మమేకమై విప్లవ పంథాలో కొనసాగాడు. ఆయన కూడా కుల్హారి ఘాట్ ఎన్ కౌంటర్ లో మరణించాడు.

ఆయన ఎక్కడా..?

గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో పార్టీ ముఖ్య నాయకత్వం మరణించడం ఆందోళన కల్గిస్తున్నాది. బలగాల దాడుల్లో తప్పికొట్టలేకపోయిన మావోయిస్టు పార్టీ శ్రేణులు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. అయితే ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేస్తున్న బాలకృష్ణ అలియాస్ బాలన్న, అలియాస్ మనోజ్ ఆచూకి ఏమైందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో వారితో పాటు మనోజ్ కూడా ఉండేఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే చలపతి, పాండులతో కలిసి మనోజ్ ఉన్నాడా లేదా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది. మొదట CCM చలపతితో పార్టీ శ్రేణులు మరణించడంతో మిగతా వారంతా సేఫ అయ్యారని అనుకున్నారు. కానీ తాజాగా మరో ముఖ్య నేత ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ మృతదేహం లభ్యం కావడంతో మనోజ్ కూడా అదే అటవీ ప్రాంతంలో అప్పుడు ఉన్నాడా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కాల్పులు ప్రారంభం అయిన నేపథ్యంలో కొంతమంది నక్సల్స్ కీకారణ్యాల్లోని సేఫ్టీ జోన్ లలోకి తరలి వెల్లి ఉంటారని పోలీసు వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. ఈ కరాణంగానే ఆ ప్రాంతంలో బలగాలు సెర్చింగ్ ఆఫరేషన్ కొనసాగిస్తున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page