అంతా మా ఇష్టం… డిసిల్ట్రేషన్ పేరిట చెరువు మట్టి దందా..

దిశ దశ, పెద్దపల్లి:

వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా ఫర్వాలేదు అన్న నానుడి పెద్దపల్లి జిల్లాలోని కొన్ని శాఖల అధికారులకు సరిపోతుంది. జిల్లాలోని ఇటుక బట్టీల పరిశ్రమలకు మట్టి వినియోగించుకునేందుకు కొన్ని చెరువుల్లో మట్టిని తరలించుకపోయేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే ఒక్కో చోట ఒక్కో రీతిలో పర్మిషన్ ఇచ్చిన ప్రొసిడింగ్స్ వివాదాలకు దారి తీస్తున్నాయి. మొక్కుబడి తంతుగా సాగిస్తున్న అధికార యంత్రాంగం పూడిక తీత పనుల పేరిట నిబంధనలకు పాతరేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మంత్రికే ఇవ్వం…

బహిరంగాంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే చెరువులు, కుంటల్లో పూడికతీతకు అనుమతిస్తూ జారీ చేసిన ప్రొసిడింగ్ కాపీలు మాత్రం బయటకు ఇవ్వడానికి ఇరిగేషన్ అధికారులు నిరాకరిస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టి విషయంలో వారు ప్రైవేటు వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు చెప్తున్న ఈ సమాధానం విస్మయపరుస్తోంది. ప్రొసిడింగ్స్ కాపీలు మంత్రి అడిగినా ఇవ్వమని… అవసరమైతే చూపిస్తామని ఇరిగేషన్ అధికారి చెప్తున్న సమాధానం విడ్డూరంగా ఉంది. మంత్రికి కూడా ప్రొసిడింగ్స్ ఇవ్వమని సదరు అధికారి చెప్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొసిడింగ్స్ ఇరిగేషన్ అధికారులు తమ ఫైళ్లకే పరిమితం చేస్తే మట్టి తరలించుకపోయే వారు ఎలా పూడిక తీస్తారోనన్నదే అంతు చిక్కకుండా పోతోంది. మరో వైపున ఎలాంటి ప్రొసిడింగ్స్ లేకుండా… వే బిల్లులు లేకుండానే పూడిక మట్టిని రవాణా చేస్తే అక్రమంగా సాగుతున్న తంతు అవుతుంది కానీ అధికారులు అనుమతి ఇచ్చినట్టు మాత్రం కాదన్న విషయాన్ని అదికారులు పట్టించుకోవడం లేదు.

త్రి మేన్ కమిటీ..?

పూడిక తీతకు ముందు ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన త్రిమేన్ కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ కమిటీ నిర్ణయించిన తరువాతే మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అన్ని శాఖల సమన్వయం లేకుండానే అనుమతులు ఇస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పర్యవేక్షణ..?

అయితే చెరువులు, కుంటల్లో తవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చినప్పుడు నీటి వనరులు అస్థిత్వం కోల్పోకుండా ఉండేందుకు ఆయా శాఖలకు సంబంధించిన యంత్రాంగం పర్యవేక్షణ కూడా ఉండడం లేదని తెలుస్తోంది. చెరువుల్లోకి వెల్లి ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేసుకుని పోతుండడం వల్ల భవిష్యత్తులో మట్టి తవ్వకాల ప్రభావం చెరువులపై తీవ్రంగా పడే ప్రమాదం లేకపోలేదు. చెరువు కట్ట, తూముల వద్ద తవ్వకాలు జరిపినట్టయితే వర్షాకాలంలో వచ్చే వరధ ఉధృతితో కొట్టుకపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. అటు చెరువులు, కుంటలు దెబ్బతినడం వల్ల వాటి రిపేర్లకు అయ్యే నిధుల భారం ప్రభుత్వంపై పడనుంది. అలాగే చెరువుల కట్టలు కానీ తూములు కాని వరధ ఉధృతికి తెగిపోయినట్టయితే దిగువన ఉన్న పంటలు కూడా మునకకు గురై రైతులు కూడా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పూడిక మట్టి తవ్వకాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సి ఉన్నప్పటికీ అలాంటి చర్యలు ఏమీ తీసుకోనట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక మీటరు మించి లోతున మట్టి కోసం తవ్వకాలు జరకూడదన్న నిబంధనలు ఉన్నందున ఆ మేరకే తవ్వకాలు జరుపుతున్నారా లేక నిబంధనలు అతిక్రమిస్తున్నారా అన్న విషయంపై పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ లోడ్, సాయంత్రం తరువాత మట్టి తవ్వకాలు జరపడం వంటి నిబంధనలు, వే బిల్లులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సి ఉన్నా అలాంటి చొరవ మాత్రం తీసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడెలా..?

అయితే యాసంగి పంట ముగిసిన వెంటనే పూడిక తీతకు అనుమతి ఇచ్చే ఆనవాయితి సహజంగా జరుగుతుంది. వర్షాకాలం ప్రారంభం అయిన తరువాత పూడిక మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చే సాంప్రాదాయం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. కానీ పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఇప్పుడు పూడిక మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం మాత్రం అందరినీ విస్మయపరుస్తోంది.

భారీ వాహనాలు…

అయితే పూడికమట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వారు ఏకంగా భారీ వాహనాలను చెరువు శిఖం ఏరియాలోకి తీసుకెళ్తుండడం గమనార్హం. సాధారణంగా నీటి వనరులున్న ప్రాంతాల్లోకి భారీ వాహనాలను అనుమతించే అవకాశాలు ఉండదని అంటున్నారు. భారీ వాహనాల్లో టన్నుల కొద్ది మట్టిని తరలించుకపోతున్న క్రమంలో చెరువు శిఖం ఏరియాలో డ్యామేజీ అవుతుందని… ట్రాక్టర్ల లాంటి లైట్ మోటారు వాహనాలకే అనుమతిస్తుంటారు. కానీ పెద్దపల్లి జిల్లాలోని చెరువుల్లో పెద్ద ఎత్తున జేసీబీలు మట్టి తవ్వకాలు జరుపుతుంటే… ఆ మట్టిని రవాణా చేసేందుకు భారీ వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం పూడిక తీత కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ట్రాక్టర్లకు అనుమతివ్వడంతో పాటు ఒక్కో చెరువులో ఒకటి రెండు మిషన్ల ద్వారా మాత్రమే తవ్వకాలు జరిపింది. కానీ ప్రైవేటు సంస్థలకు పూడిక మట్టి తరలించేందుకు అనుమతించిన తరువాత ఇష్టారీతిన మిషనరీని కూడా వినియోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నదుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతించినప్పటికీ భారీ వాహనాలు మాత్రం వెల్లకూడదన్న నిభందన ఉంది. నిండుగా ప్రవహించే నదుల్లో నీరు తగ్గుముఖం పట్టిన తరువాత ఇసుకను ట్రాక్టర్ల ద్వారా స్టాక్ యార్డుకు తరలిస్తుంటారు. పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయని ఈ నిభందనలు విధించారు. కానీ తక్కువ సామర్ధ్యంలో నీరు ఉండే చెరువుల శిఖంలోకి భారీ వాహనానలు అనుమతించడం సరైందేనా కాదా అన్న విషయంపై జిల్లా అధికార యంత్రాంగం చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.

అ అనుభవం మరిచారా..?

పెద్దపల్లి జిల్లా అధికారులు ఇప్పటికే పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కట్టని చెక్ డ్యాంల వద్ద పూడిక తీత కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చిన చరిత్ర ఈ జిల్లా అధికారయంత్రాంగానికే దక్కింది. ఈ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించడంతో ఎన్జీటీ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను తప్పు పట్టడంతో పాటు ఇసుక తవ్వకాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇదే జిల్లాలో చెరువులు, కుంటల్లో పూడికతీత పేరిట కొత్త తరహా అనుమతులకు శ్రీకారం చుడుతున్న తీరుపై పర్యావరణ నిబంధనలు అమలు కాలేదని ట్రిబ్యూనల్ ను ఆశ్రయిస్తే అధికార యంత్రాంగం చిక్కుల్లో పడే ప్రమాదం కూడా లేకపోలేదు. 

You cannot copy content of this page