ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యల కలకలం

వంకర రాసేటోళ్లను సక్కగా చేయూండ్రి

దిశ దశ, హైదరాబాద్:

మంచిర్యాల జిల్లా చెన్నూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో నిర్వహించిన ఓ సమావేశంలో పార్టీ నాయకులతో మాట్లాడుతుండగా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన ఈ కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏమన్నారంటే..? ఈ మీడియా కొంతమంది వాళ్లు వీళ్లు వంకర రాతలు రాసేటోళ్లందరిని కూడా మీరు మాట్లాడి, 45 రోజులు ఎవడు వంకర రాతలు రాయకుండా సక్కగ జేయుండ్రి. సక్కగ చేయడానికి ఏం చేయాలో అది చేసి పడేయుండ్రి. ఆలోచించేది లేదు… పట్టణ అధ్యక్షుడు బాధ్యత తీసుకుని మీకు అవసరం అనుకుంటే మరో ఇద్దరు ముగ్గురిని కలుపుకుని అది ఎట్ల చేస్తారో చేయండని కామెంట్ చేశారు. మీడియా ప్రతినిధుల గురించి బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తప్పు పడుతున్నారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు లీక్ కావడంతో చెన్నూరు బీఆర్ఎస్ కార్యకర్తలు డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది నాయకులు అయితే సోషల్ మీడియా వేదికగానే దురదృష్టవశాత్తు జరిగింది వదిలేయండి అని కొందరు, బాల్క సుమన్ అలసటగా ఉన్నందున ఫ్లో అని ఉంటారని మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్తున్నారు. అయినప్పటికీ ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం జర్నలిస్టులను ఉద్దేశించి అలా కామెంట్ చేయడం సరికాదన్న అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని పోలిటికల్, ప్రెస్ గ్రూపుల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యల చుట్టే కామెంట్లు కొనసాగుతుండడం గమనార్హం.

You cannot copy content of this page