అప్పుడు పట్టించుకోని నాయకత్వం…
ఇప్పుడే ఎందుకు సీరియస్ గా తీసుకుంటుంది..?
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పీఠం ఊడిపోతుందన్న ప్రచారానికి అనుకూలంగా జాతీయ నాయకత్వం ఉందా..? సంజయ్ పార్టీ ముఖ్య నేతలను సమన్వయ పర్చడంలో విఫలం అయ్యాడన్న విషాయన్నే నేషనల్ పార్టీ సీరియస్ గా తీసుకుంటోందా..? అలాంటిదేమీ లేదని కొంతమంది ముఖ్య నాయకులు చెప్తున్నా… ప్రచారం ఎందుకంతా బలంగా సాగుతోంది..?
బండిపై ఆరోపణల పరంపర…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో భారీ కసరత్తులు చేసిన తరువాతే సంజయ్ పేరు ప్రకటించింది అధిష్టానం. ఆయారాం గయారాంలకు కీలక బాధ్యతలు అప్పగించే సిద్దాంతానికి బీజేపీ వ్యతిరేకమని బండి వైపు మొగ్గు చూపింది. సంఘ్ పరివార్ కూడా ఆయన పేరే ప్రతిపాదిండచంతో ఆ పదవి వరించింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన ఆరోపణలు కూడా అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షుడు కాగానే రూ. 600 కోట్లు సంపాదించాడని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నాడని, ప్రజా సంగ్రామ యాత్రతో పాటు పలు రకాలుగా ఫిర్యాదుల పరంపరం కొనసాగింది. ఇంతకాలం ఆయనను చుట్టుముట్టిన అంశాలన్ని కూడా పార్టీపై తీవ్ర ప్రభావం చూపేవే. అయినప్పటికీ సంజయ్ ని అధిష్టానం మందలించలేదు, పదవి నుండి తొలగించలేదు కూడా. వీటన్నింటిపై కూడా ఆరా తీసిన అదిష్టానం ఆయనకు మద్దతు ఇచ్చిందంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా. ఇంతకాలం వచ్చిన ఆరోపణలన్ని కూడా పార్టీపై తీవ్ర ప్రభావం చూపేవే అయినా జాతీయ నాయత్వం పట్టించుకోకుండా ఆయనచే విడుతల వారిగా ప్రజా సంగ్రామ యాత్ర చేయాలని కూడా జాతీయ నాయకత్వం పూనుకుంది. ఉన్నట్టుండి సంజయ్ పాదయాత్రను ఆపేసిన నాయకత్వం ఇప్పుడు ఆయనను మార్చే ప్రతిపాదనను ఎందుకు పరిశీలిస్తున్నదో అంతు చిక్కకుండా పోతోంది.
కారణం అదేనా..?
అయితే ఇప్పుడు బండి సంజయ్ పై వస్తున్న ఆరోపణ మాత్రం చాలా తీవ్రమైందని జాతీయ నాయకత్వం ఎందుకు భావిస్తోందన్నది కూడా మిస్టరీగా మారింది. రాష్ట్ర నాయకుల్లో సమన్వయం చేసుకోవడంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా విఫలం అయ్యాడన్నదే ప్రధానమైన ఆరోపణ. ఒక టర్మ్ పదవి కాలం ముగిసిపోయిన వెంటనే సంజయ్ స్థానంలో మరోకరిని నియమించకుండా ఎన్నికల వరకూ సంజయ్ ఉంటాడని పదే పదే ప్రకటించిన జాతీయ నాయకత్వం ఇప్పుడు అనూహ్యంగా యూ టర్న్ ఎందుకు తీసుకుంటోందన్న ప్రశ్న తలెత్తుతోంది. గత ఆరేడు నెలల నుండే సంజయ్ సమన్వయం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడన్న ప్రచారం ఊపందుకోవడానికి కారణాలు ఏంటీ..? దీని వెనక జరుగుతున్న స్కెచ్ ఏంటో తెలుసుకోవల్సిన అవసరం జాతీయ నాయకత్వంపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీపై ప్రభావం చూపించే ఆరోపణలను పక్కన పెట్టిన బీజేపీ నేషనల్ పార్టీ ఇప్పుడు కో ఆర్డినేషన్ ఫెయిల్యూరనే అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. ఈ ఆరోపణలు కూడా చేస్తున్నదెవరూ..? పార్టీని మొదటి నుండి అంటిపెట్టుకున్న నాయకులు కాకపోగా, ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారే ఈ విమర్శలు చేస్తున్నారన్నది కమలం పార్టీలో బహిరంగ రహస్యం. సమన్వయం చేసుకునే విధంగా సంజయ్ ని మార్చితే సరిపొతుంది కదా… ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ ని తొలగించడం వల్ల పార్టీకి లాభమా నష్టమా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం హుటాహుటిన నాయకత్వ మార్పుకు శ్రీకారం చుట్టేందుకు సాహసిస్తుందా అన్న అనుమనాలూ వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఊపు కనిపించడానికి ప్రధాని మోడీ మానియా ఎంత ఉందో సంజయ్ దూకుడు కూడా అంతే స్థాయిలో ఉందన్నది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు ఆయన్ని మార్చడం వల్ల రానున్న ఎన్నికల్లో ఇక్కడి పార్టీ శ్రేణులకే అయినా, రాష్ట్ర ప్రజలకే అయినా ఎలాంటి సంకేతాలను అధిష్టానం పంపించనుందోనన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఏది ఏమైనా బండి సంజయ్ ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడి బాద్యతల నుండి తప్పించడం మాత్రం రాష్ట్ర బీజేపీ శ్రేణులకు సరికొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుందన్నది వాస్తవం.