మనకు మాత్రం 14 రోజుల పాటు సమాచారం
ఆ తరువాత కూడా పనిచేస్తే అద్భుతమే…
దిశ దశ, న్యూ ఢిల్లీ:
చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రపంచమంతా అబ్బురపడిపోతుంటే భారతీయులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చంద్రుడికి అవతలి వైపు ఏం జరుగుతోంది అన్న విషయం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు భారత శాస్త్ర వేత్తలు సఫలం అయ్యారు. చంద్రయాన్ 3 ద్వారా విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియ సక్సెస్ కావడంతో కొన్ని గంటలకు ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి తన పరిశోధనలను ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడి చిత్రాలు రోవర్ ద్వారా ఇస్రోకు పంపించగానే వాటిని మన శాస్త్ర వేత్తలు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం వైపు మనుగడలో ఉన్న ఆనవాళ్లను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరంగా 14 రోజుల పాటు సాగనుంది. భూతలంపై ఉన్న జీవరాశులకు మాత్రం 14 రోజులు గడపాల్సి ఉన్నా… చంద్రుడి దక్షిణ ధృవంలో మాత్రం ఆ కాలం అంతా కలిపితే ఒక్క పగటి పూట మాత్రమే. అంటే మనం 14 రోజుల పాటు పగలు రాత్రి చూస్తే… చంద్రుడి దక్షిణ ధృవంలో మాత్రం ఒక్క పగటి పూట అన్నమాట. ప్రగ్యాన్ రోవర్ నిరంతరంగా 336 గంటల పాటు తన పరిశోధనలను కొనసాగించే అవకాశం ఉంది. రోవర్ ప్రగ్యాన్ ల్యాండర్ తో అనుసంధానం చేయడంతో ల్యాండర్ కు ఎప్పటికప్పుడు రోవర్ అప్ డేట్ చేస్తుంది. విక్రమ్ ల్యాండర్ తో పాటు రోవర్ చేసే పరిశోధనలు నేరుగా పరిశోధన కేంద్రానికి కమ్యూనికేట్ చేస్తుంటుంది. ఐదు పరిశోధక పేలోడ్స్ ద్వార దక్షిణ దృవం గురించి ఆరా తీసేవిధంగా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. 14 రోజుల ఆ తరువాత చంద్రుడికి అవతలి వైపున సూర్యాస్తమయం అయిన తరువాత ఇవి పని చేసే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యాస్తమయం అయిన తరువాత అక్కడ అంధకారంగా మారడంతో పాటు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ కు ఉష్టోగ్రతలు పడిపోతాయి. దీంతో సోలార్ ప్యానెల్ ద్వారా శక్తిని అందుకునే విక్రమ్, ప్రగ్యాన్ లు 14 రోజుల తర్వాత చీకటిమయం కావడంతో పాటు ఉష్టోగ్రతలు కూడా పడిపోతాయి కాబట్టి పనిచేసే అవకాశం లేదు. మరో 14 రోజుల తరువాత సూర్యోదయం అయిన తరువాత అక్కడ ఉష్ణోగ్రతలు పెరగడంతో విక్రమ్, ప్రగ్యాన్ లు తిరిగి పనిచేయడం ఆరంభిస్తే ఇస్రో మరో ఘనతను సాధించినట్టే అవుతుంది. ఆ తరువాత కూడా సూర్యరశ్మితో అవి పనిచేయడం మొదలు పెడితే మరింత కాలం చంద్రుడి దక్షిణ ధృవం గురించి తెలుసుకునే అవకాశం చిక్కుతుంది. ఈ క్రెడిట్ కూడా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికే దక్కనుంది.