దిశ దశ, కరీంనగర్:
బీఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలకు ఇంకా చెక్ పడనట్టుగానే ఉంది. కరీంనగర్ లో ముఖ్య నాయకుల మధ్య ఏర్పడిన అంతరం ఇంకా అలాగే కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిని అధిగమించి ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని అధిష్టానం యోచిస్తుంటే… క్షేత్ర స్థాయిలో మాత్రం నాయకుల మధ్య ఉన్న విబేధాలు ఆ పార్టీకి మరింత నష్టాన్నే చేకూరుస్తున్నాయి. ఎవరికి వారే… యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఆ నాయకులు ఏక తాటిపైకి మాత్రం రావడం లేదన్న చర్చ బహిరంగంగానే సాగుతోంది. దీంతో ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా అభిప్రాయ బేధాలతో ఉన్న ఆ నేతలు మాత్రం కలిసి తిరగడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
సారొస్తేనే…
రెండు మూడు నెలలుగా సాగుతున్న లోకసభ ఎన్నికల ప్రచారంలో అంటీముట్టనట్టుగానే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ రవిందర్ సింగ్ లు ఒకే వేదికపై మాత్రం కనిపించడం లేదు. ప్రచార పర్వంలో కూడా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో కూడా గంగుల, రవిందర్ సింగ్ లు కలిసి కనిపించిన సందర్భాలు అంతంతమాత్రమే. అధినేత కేసీఆర్ కరీంనగర్ లో బోయినపల్లి వినోద్ కుమార్ గెలిస్తే బావుంటుందని అనుకుని సమీకరణాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్ 48 గంటల పాటు సైలెంట్ గా ఉండాలని ఆదేశించడంతో ఆయన టూర్ రీ షెడ్యూల్ చేశారు. ఈ క్రమంలో బిజీబిజీగా ఉన్నప్పటికీ కేసీఆర్ కరీంనగర్ కోసం స్పెషల్ దృష్టి పెట్టారు. రెండు సార్లు ఈ జిల్లాలో టూర్ నిర్వహించే విధంగా రీ షెడ్యూల్ లోనూ ప్లాన్ చేసుకున్నారంటూ ఆయన వినోద్ కుమార్ విషయంలో ఎలాంటి శ్రద్ద చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే కరీంనగర్ ప్రచారంలో మాత్రం వర్గ విబేధాలతో ముందుకు సాగుతున్న గంగుల కమలాకర్, రవిందర్ సింగ్ కలిసి కనిపించిన సందర్భాలు నామమాత్రమే. దీంతో కరీంనగర్ లో గ్రూప్ పాలిటిక్స్ మాత్రం అలాగే సాగుతున్నాయన్న విషయం స్ఫష్టం అయిపోయింది. రెండు రోజుల క్రితం కరీంనగర్ లో కేసీఆర్ టూర్ లో మాత్రం ఈ ఇద్దరు నేతలు అధినేత పక్కన కనిపించడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చినట్టయింది. ఎంపీ ఎన్నికల క్యాంపెయిన్ లో ఇద్దరు నాయకులు కలిసి ఒకే వేదికను పంచుకోవడంతో ఇద్దరు కలిసి ముందుకు సాగితే బావుంటుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.
ఆ ఎన్నికలప్పుడూ…
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒకే నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరు నాయకులు దూరం దూరంగానే ఉన్నారు. అప్పటికే వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్న విషయాన్ని గమనించిన అధిష్టానం కూడా రవిందర్ సింగ్ కు పెద్దపల్లి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. దీంతో వీరిద్దరు కూడా ఆ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయలేదు. తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ కే పరిమితమైన ఈ ఇద్దరు నాయకులు మాత్రం ఎడమొఖం… పెడమొఖంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.