భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం టీ కాంగ్రెస్‌లో మళ్లీ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలవదని, 40 సీట్లకు మంచి సీట్లు రావని సొంత పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఖాయమని వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పొత్తు పట్ల కొంతమంది సానుకూలంగా వ్యవహరిస్తుండగా.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని గతంలో వరంగల్ సభ వేదికగా రాహుల్ గాంధీ చెప్పారని, అయినా పార్టీ లైన్ ను దాటి ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ తలంటినట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలా వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు చెబుతున్నారు.
మాణిక రావుతో భేటీ తర్వాత తన వ్యాఖ్యలపై వెంకటరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన మాటల్లో తప్పు లేదన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని, అసలు ఏ పార్టీతోనూ ఉండదని చెప్పారు. ఒక సర్వే రిపోర్టు ప్రకారం తాను చెప్పానని, తన పూర్తి వీడియోను తమ పార్టీ నేతలు చూడలేదన్నారు. తన వ్యాఖ్యలను ఠాక్రే లైట్ తీసుకున్నారని వెంకటరెడ్డి బయటకు చెబుతున్నప్పటికీ.. లోపల ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని సూచించారని, గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని చెప్పానన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తీవ్రంగా నష్టపోయానని, ఇప్పుడు అలాంటి తప్పు చేయకుండా ముందుకు వెళ్లాలని సూచించినట్లు చెప్పారు. ఎవరితో పొత్తుకు లేకుండా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాగా వచ్చే ఎన్నికల్లో హంగ్ తప్పదని, ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రావని తెలిపారు. ఏ పార్టీకి కూడా 60కిపైగా సీట్లు రావని, అందుకే పొత్తులు తప్పవని చెప్పారు.