దిశ దశ, కరీంనగర్:
ప్రసవం తరువాత తల్లి బిడ్డ క్షేమమంటూ ఊపిరి పీల్చుకునే వారంతా కూడా ఊపిరి సలపనంత బీజీగా వృత్తికి అంకితమయిన వారే. సెమినార్లు… పేషెంట్లతో బిజీబీజీగా ఉంటూ గజిబిజిగా జీవనం సాగించడం వారి గమనంలో ఓ భాగం అయిపోయింది. వీకెండ్స్ లో మానసిక ప్రశాంతత కోసం తమ ఫ్యామిలీకే ప్రాధాన్యతనిచ్చే వారంతా ఒకే వేదికపై తమలోని కళలను ప్రదర్శించారు. మనిషన్నాక కళా పోషణ ఉండాలబ్బాయ్ అన్నట్టుగా సాగింది కరీంనగర్ డాక్టర్ల ప్రదర్శన తీరు. నిరంతరం వైద్య వృత్తికే పరిమితమైన ఆ వైద్యులు తమలోని టాలెంటును ప్రదర్శించారు. డాక్టర్స్ డే సందర్భంగా యాక్టర్లుగా మారిపోయిన కరీంనగర్ ఐఎంఏ సభ్యులు వెండితెర, బుల్లితెర నటులకు తామేం తీసిపోమన్నట్టుగా తమలోని కళలను వెలికితీశారు. కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆద్వర్యంలో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కాస్తా డిఫరెంట్ గానే సాగాయి. డాక్టర్స్ డే అంటే నాలుగు ముచ్చట్లు చెప్పుకోవడం… వృత్తిలో తమ గొప్పతనాన్ని వివరించుకోవడం… సత్కారాలు… సన్మానాలు చేసుకుని సంబరపడిపోవడానికే పరిమితమైతే సంతోషం ఏముంటుదని భావించిన కరీంనగర్ వైద్యులు తమలోని కళాత్మకతకు పదును పెట్టారు. స్టెత్ చేతిలో పట్టుకుని స్ట్రెస్ అయ్యే మనసును ఉల్లాసం, ఉత్సాహం వైపు పరిగెత్తించారు. ఓటీలో ఉన్న పేషెంట్ పరిస్థితి ఏంటన్న ఆందోళనతో కొట్టుమిట్టాడే తమకూ మానసికోల్లాసం ఉంటే మంచిదని భావించిన కరీంనగర్ డాక్టర్స్ తమలోని కళా ప్రదర్శనతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత సంవత్సరం నుండి కరీంనగర్ డాక్టర్లు తమలో దాగి ఉన్న టాలెంటును సహచర డాక్టర్ల ముందు ప్రదర్శించడం మొదలు పెట్టారు. పెషేంట్ల అరుపులతో సహవాసం చేసిన డాక్టర్లంతా డాక్టర్స్ డే సందర్భంగా కేరింతలు కొడుతూ కళలను ప్రదర్శించిన సహచర డాక్టర్లను ప్రోత్సాహించారు. అహ్లాదభరితంగా సాగిన వైద్యుల దినోత్సం నాడు తాము నాడి పట్టడంలో స్పెషలిస్టులమే కాదు… నాట్యంలోనూ అంతే స్పెషాలిటీని ప్రదర్శిస్తామని చేతల్లో చూపించి సరికొత్త వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. మానసిక ప్రశాంతత కావాలంటే మరమనషులుగా బ్రతకడం కాదు… మదిలో దాగి ఉన్న ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాగుతుందని చేతల్లో నిరూపించారు. కరీంనగర్ ఐఎంఏ డాక్టర్లు తమలోని కళలను ప్రదర్శించడంలో చూపించిన ఉత్సుకత ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. వైవిద్యంగా సాగిన డాక్టర్స్ డే కరీంనగర్ కే హైలెట్ గా నిలిచింది.
పండిట్ల సంఘం…
రాష్ట్ర భాషా పండిట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మీనాక్షి ఆసుపత్రిలో ప్రత్యేకంగా డాక్టర్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవి కుమార్ పవన్ కుమార్ సుధీర్ పలువురు వైద్యులను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంభోజి శేకర్ ఘనంగా సన్మానించారు.