చిత్తూరు జిల్లా కుప్పంలో ఇటీవల గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. తారకరత్నకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. జనవరి నెలాఖరు నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి డాక్టర్లను రప్పించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. హృద్రోగంతో పాటు నాడీ సమస్యలకు చికిత్సను అందిస్తున్నారు.
కాగా, గత నెల 28వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది.. కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తర్వాత వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అప్పటి నుంచి తారకరత్నకు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత 15 రోజులుగా తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. నందమూరి బాలకృష్ణ తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స చేశారు. పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు, తారకరత్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.