ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై డిప్యూటేషన్ వేటు
దిశ దశ, పెద్దపల్లి:
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదేనేమో. పెన్ను అడిగితే లేదన్న పాపానికి ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిపై గుర్రుమన్నారు పెద్ద సార్లు. విధుల నుండి బయటకు పంపించిన పెద్ద డాక్టర్లు పెట్టిన ఇబ్బందిని చెప్పుకుందా చిరు ఉద్యోగి. అవకాశం చూస్తున్నారో లేక… వేరే ఉద్దేశ్యమో తెలియదు కానీ ఓ ఛానెల్ లో ఆమె చేసిన ఆరోపణలు వచ్చాయన్న సాకు చూపి డిప్యూటేషన్ పై బదిలీ వేటు వేశారు. అలా ఉత్తర్వులు వచ్చాయో లేదో ఇలా ఆ దళిత బిడ్డను చకచకా రిలీవ్ కావాలని కూడా ఉత్తర్వులు ఇచ్చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా ఉన్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది.
బాధితురాలి కథనం…
పెద్దపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మణి హర్షిణిని డాక్టర్ యామిని అనే పీజీ స్టూడెంట్ పెన్ ఇవ్వాలని అడిగారు. తనవద్ద పెన్ లేదని మణి హర్షిణీ బదులివ్వడంతో అక్కడే ఉన్న అనెస్తీషియా డాక్టర్ కృష్ణవేణి, గైనకాలిజిస్ట్ డాక్టర్ రుక్మిణీలు ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వెళ్లగొట్టారు. దీంతో మానసిక వేదనకు గురైన నేను ఆసుపత్రి ముందు వచ్చి కూర్చోని బాధపడుతున్న తీరును చూసి అక్కడే ఉన్న కొందరు ఏం జరిగిందని ప్రశ్నించారు. దీంతో తాను విషయం అంతా వివరిస్తున్నప్పుడు రిపోర్టర్ ఎవరో మొబైల్ లో నా వాయిస్ రికార్డ్ చేసుకుని ‘క్యూ’ న్యూస్ లో రిలే చేశారు. దీంతో ఛానెల్ లో డాక్టర్లను బద్నాం చేశారన్న కారణం చూపుతూ ఒక్క రోజులో సంజాయిషీ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వెంటనే సమాధానం ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందకపోవడంతో తనను సుల్తానాబాద్ CHCకి డిప్యూటేషపన్ పై బదిలీ చేస్తూ మణిహర్షిణీ స్థానంలో కె సుధాకర్ ను డిప్యూట్ చేశారు. దీంతో మానసిక వేదనకు గురైన బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.