డాక్యూమెంట్ల ట్యాంపరింగ్ దందా… తవ్వినా కొద్ది అక్రమాలే…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ భూ మాఫియాలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కో కేసు దర్యాప్తు చేస్తున్నా కొద్ది పోలీసులకు సంచలన విషయాలను తెలుస్తున్నాయి. దీంతో కరీంనగర్ కేంద్రంగా భారీ భూ స్కాం జరిగనట్టుగా అంచనా వేస్తున్నారు. డాక్యూమెంట్లను క్రియేట్ చేసేందుకు స్పెషల్ గ్యాంగులు కూడా ఏర్పాటయినట్టుగా అనుమానిస్తున్నారు. భూ మాఫియాలో అక్రమ వ్యవహారాలపై కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ ఘటన కలకలం సృష్టించింది. గత డిసెంబర్ 24న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు చేసిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడంతో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యూమెంట్ దొంగతనం చేసిన సుభాష్ నగర్ వాసి సుఖ్ దేవ్ శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కీలక విషయాలను కరీంనగర్ పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఓ బైక్ కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సుఖ్ దేవ్ శేఖర్ కు అతని స్నేహితులు మతిన్, ఓసామాలులు అడ్వకేట్ మిర్జా అజిమత్ అలీ బేగ్ ను పరిచయం చేశారని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. అడ్వకేట్ కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బుక్ నంబర్ 1లోని వాల్యూమ్ నెం 376 తీసుకొచ్చినట్టయితే రూ. 50 వేలు ముట్టచెప్తానన్నాడని దీంతో తాను ఈ డాక్యూమెంట్ చోరీ చేశారనని నిందితుడు పోలీసులకు వివరించాడు. దీంతో సుఖ్ దేవ్ శేఖర్ చోరీ చేసిన వాల్యూమ్ ను మతిన్, ఓసాములుకు ఇవ్వగా వారు రూ. 50 వేలు ఇచ్చారని వివరించాడు. దీంతో నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భారీ స్కెచ్…

అయితే కరీంనగర్ లో భూ దందాలకు సంబంధించిన డాక్యూమెంట్లను టాంపరింగ్ చేసే దందా కూడా దర్జాగానే సాగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ ఘటన తరువాత పోలీసుల అనుమానానికి మరింత బలం చేకూరినట్టుగా తెలుస్తోంది. నకిలీ డాక్యూమెంట్లను క్రియేట్ చేసి కోర్టులను ఆశ్రయించడంతో పాటు యజమానులను బెదిరింపులకు గురి చేసిన వారూ ఉన్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. కరీంనగర్ సమీంలోని ఓ మాజీ ప్రజా ప్రతినిధి అయితే మూడు నాలుగు గ్రామాలకు సంబంధించిన డాక్యూమెంట్లను క్రియేట్ చేసి యజమానులను ముప్పు తిప్పలు పెట్టారని పోలీసుల విచారణతో తేలినట్టు సమాచారం. ఇతని ద్వారా వందల సంఖ్యలో డాక్యూమెంట్లు క్రియేట్ కావడం, పంచాయితీల్లో పర్మిషన్లు తీసుకోవడం కూడా చకాచకా జరిగిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత డేట్లలో నాన్ జ్యుడిషియల్ స్టాంపులు, రబ్బర్ స్టాంపులు కూడా తయారు చేసుకుని భూ దందాలకు పాల్పడిన ముఠాలు కూడా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. గత పదిహేనేళ్లలో కరీంనగర్ లో సెటిల్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన క్రమంలో భూముల ధరలకు రెక్కలు రావడంతోనే అక్రమార్కుల గ్యాంగులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన సామాన్యుల ప్లాట్లకు సంబంధించిన డాక్యూమెంట్లు క్రియేట్ అయి పంచాయితీల్లో అనుమతులు తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, బొమ్మకల్ తో పాటు పలు గ్రామాల్లో చాలా కాలం క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ భూములకు సంబంధించిన యజమానులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చే సరికి పంచాయితీల్లో అనుమతులు కూడా తీసుకుని ఇండ్లు నిర్మించుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్లాట్లలో అయితే కంపౌండ్ వాల్ పెట్టుకోవడం, పునాదులు నిర్మించడం వంటివి కూడా చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరిఖనితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు దశాబ్దాల క్రితం కొనుక్కున్న ప్లాట్లు తమవేనని చెప్పేందుకు పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. ఇలాంటి ఫేక్ డాక్యూమెంట్ గ్యాంగులతో మిలాఖత్ అయిన కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కారణంగా సామాన్యులు శ్రమదోపిడీకి గురైన సందర్బాలు ఎన్నో ఉన్నాయి.

You cannot copy content of this page