స్టార్ రేటింగ్స్ ఇస్తూ… బొనాంజాలు ప్రకటిస్తూ…

క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ దందాలో మరో కోణం…

దిశ దశ, జగిత్యాల:

ఆన్ లైన్ నెట్ వర్క్ సాగుతున్న క్రిప్టో, బిట్ కాయిన్ వ్యాపారంలో తవ్వినా కొద్ది కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో జాయిన్ చేసే వారికి స్టార్ రేటింగ్స్ ఇస్తూ… బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు ఏజెంట్లు. మలేషియా, బాలీ, థాయిలాండ్, దుబాయి వంటి దేశాల్లో టూర్లు చేయించడం, అక్కడ స్టార్ హోటల్స్ అకామిడేషన్, సైట్ సీయింగ్ తో పాటు పలు రకాల లగ్జరీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. బిజినెస్ నిర్వహించే వారు తమ గ్రూపులో జాయిన్ చేసిన వారికి ‘స్టార్’ రేటింగ్స్ ఇస్తూ వారికి వచ్చిన రేటింగును బట్టి తాయిలాలు ఇస్తున్నారు. కొంతమందికి అయితే విదేశాలకు తీసుకెళ్లి అక్కడ లగ్జరీ వసతులన్ని ఏర్పాటు చేయించి కూడా రూ. లక్ష రూపాయల విలువ చేసే బ్రాండెడ్ ఫోన్లను గిఫ్టులుగా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో తాము చేరడం వల్ల ఆధాయం, చేర్పించడం వల్ల కమిషన్, రేటింగును బట్టి బొనాంజాలు ప్రకటిస్తుండడంతో దర్జాగా బ్రతికేయవచ్చన్న ధీమాతో వేలాది మంది ఈ వ్యాపారంలో చేరుతున్నారు.

విదేశాల్లో పర్మిషన్…

కొత్తమంది ఏజెంట్లు ఈ వ్యాపారానికి ఫలానా దేశంలో అనుమతి ఉందని, మన దేశంలో లేకున్నా ఫర్వాలేదని, సంబంధిత దేశంతోనే మనం లావాదేవీలు చేస్తున్నామని చెప్తూ సామాన్యులను మెప్పించి ఒప్పించి ఈ దందాలోకి దించుతున్నారు. తమకన్నా ముందు చేరిన వారికి డబ్బులు వస్తున్నాయన్న విషయాన్ని గమనించిన అమాయకులు తమ ఆస్తులను కూడా తెగనమ్ముకుని ఈ వ్యాపారంలో చేరుతున్నారు.

ఫోన్లు స్విచ్ఛాఫ్…

జగిత్యాల పోలీసులు క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వ్యాపారంపై దృష్టి సారించడమే కాకుండా పలువురిపై కేసు నమోదు చేయడంతో ఈ వ్యాపారంలో ఏజెంట్లుగా, సబ్ ఏజెంట్లుగా ఉన్న వారంతా కూడా తమ ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకుని తిరుగుతున్నట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది. తమకు పోలీసుల నుండి పిలుపు వస్తే అరెస్ట్ చేయడం ఖాయం అని గుర్తించిన వారంతా కూడా ఫోన్లు స్విచ్ఛాప్ చేసినట్టుగా సమాచారం.

ఆ డబ్బు ఎలా..?

ఈ వ్యాపారంలో చేరిన వారికి కమిషన్లు, రెట్టింపు డబ్బు, లగ్జరీ టూర్లు, ఫారిన్ ట్రిప్స్ వంటి చేపడుతున్న నిర్వాహకుల చేతికి వందల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి..? అసలు వారు ఈ డబ్బుతో చేస్తున్న వ్యాపారం ఏంటీ..? అందుకు సంబంధించిన ఆధారాలు కానీ, వారు చేస్తున్న వ్యాపారా సామ్రాజ్యాన్ని ఈ వ్యాపారంలో చేరిన వారికి చూపించారు. విదేశాల్లో అనుమతులు ఉన్నాయని చెప్తున్న వారు ఆయా దేశాల్లో ఏజెంట్లకు టూర్లు నిర్వహించినప్పుడు సదరు కంపెనీ కానీ, వ్యాపార సంస్థలను కానీ చూపించారా..? వాటి ద్వారా వస్తున్న ఆదాయం ఎంత, అందుకు నిర్వాహకులు చేసిన ఇన్వెస్టిమెంట్ ఎంత..? నెట్ వర్క్ వ్యాపారంలో చేరిన సభ్యులు చెల్లించిన డబ్బులు ఎన్ని తదితర అంశాలపై దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఆన్ లైన్ యాప్స్ లో మాత్రం సభ్యులకు పాయింట్లు ఇస్తున్నప్పటికీ వారికి వచ్చే డబ్బులు ఆన్ లైన్ లో బ్యాంకు అకౌంట్ల ద్వారా లాభాలకు సంబంధించిన లావాదేవీలు జరపడం లేదు. సభ్యులుగా చేర్చిన ఏజంట్లకు కూడా ప్రత్యేకంగా ఇచ్చే ఐడీ నంబర్ కోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సభ్యులకు వచ్చే పాయింట్లను బేస్ చేసుకుని నిర్వాహాకులు వాటిని డాలర్లుగా కౌంట్ చేసి ఎంత డబ్బు వస్తుందో లెక్క కడుతున్నారు. ఆ డబ్బును నేరుగా కోడ్ నంబర్ ఉన్న ఏజంటుకు వచ్చి చేరుతోంది. అతని నుండి నేరుగా మెంబర్ ఇంటికి డబ్బు చేరుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక వేళ ఈ వ్యాపారం అంతా కూడా నిబంధనల ప్రకారమే నడిచినట్టయితే లావాదేవీలను బ్యాంకు అకౌంట్ల ద్వారా ఎందుకు చేయడం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.

మనీ లాండరింగ్..?

ఆన్ లైన్ నెట్ వర్క్ దందాలో మనీ లాండరింగ్ వ్యవహారాలు సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. సభ్యులకు, ఏజెంట్లకు ఇస్తున్న డబ్బు అంతా కూడా నేరుగా వారి వద్దకు చేరుతున్నందున ఈ వ్యాపారం అంతా కూడా చట్ట వ్యతిరేకమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హవాలా రూపంలో నల్లబజారులో డబ్బులను తరలించే విధానాన్ని ఎంచుకోవడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఒక వేళ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నట్టయితే సదరు కంపెనీల నుండి డబ్బును మెంబర్ల అకౌంట్లలో్కి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది కదా అన్న చర్చ సాగుతోంది. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ‘‘షిప్ట్’’ కోడ్ ఇచ్చినట్టయితే విదేశాల నుండి వచ్చే డబ్బు నేరుగా అకౌంట్లలో వచ్చిపడుతోంది. దేశీయంగా జరిపే లావాదేవీలకు IFSC కోడ్ ఉన్నట్టుగా అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన లావాదేవీలకు ప్రతి బ్యాంకు బ్రాంచ్ కార్యాలయానికి షిప్ట్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ నంబర్ ను బ్యాంక్ మేనజర్ల వద్ద తీసుకుని ఈ వ్యాపారం చేస్తున్న నిర్వాహాకులకు ఇచ్చినట్టయితే సరిపోతుంది. అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలను సదరు బ్యాంకులు అకౌంట్ నుండి కట్ చేసుకుంటుంది. ఇలా చేయడం వల్ల అధికారికంగా వ్యాపారం నిర్వహించినట్టు అవుతుంది. హవాలా మార్గంలో లావాదేవీలు జరిపే విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఉన్న వ్యాపార సంస్థలు చేయవన్న విషయాన్ని గమనించాలి. ఒకరి చేతుల నుండి మరోకరి చేతుల్లో వచ్చి చేరుతున్న డబ్బుకు మెంబర్లు భవిష్యత్తులో ఐటీ విభాగానికి లెక్కలు చూపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ నెట్ వర్క్ బిజినెస్ లో చేరడం వల్ల ఆదాయం గడించామని చెప్పినట్టయితే లాభాలకు సంబంధించిన వివరాలు, అందుకు సంబంధించిన అధికారిక లావాదేవీల గురించి ఇన్ కం ట్యాక్స్ విభాగం ఆరా తీస్తుంది. ఆలా అరా తీసినప్పుడు అధికారికంగాలాభాలు గడించినట్టుగా అధికారికంగా ట్రాంజక్షన్ చేసినట్టుగా రికార్డులు ఉండవు. దీంతో చివరకు ఈ వ్యాపారంలో చేరిన సామాన్యులే సమిధలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది.

You cannot copy content of this page