అన్నా చెల్లెల్లకు అచ్చీరానీ మానుకోట

12 ఏళ్ల క్రితం అన్న టూర్లో గొడవ

నేడు చెల్లెలి టూర్లో రభస

వైఎస్సార్ ఫ్యామిలీకి మానుకోటకు బద్ద వైరుద్యం ఉన్నట్టుంది. ఆ జిల్లాలో పర్యటనలు చేసిన ఆ కుటుంబంలోని ఇద్దరు కూడా అరెస్టు కావడం కలకలం సృష్టిస్తోంది. ఉద్యమ సమయంలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించిన ఉద్యమ కారులు మానుకోట రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తాజాగా ఆయన సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్రలో కూడా ఆందోళన నెలకొనడం గమనార్హం.

2010లో అన్న….

తెలంగాణ వ్యాప్తంగా స్వరాష్ట్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న 2010 మే 28న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహబూబాబాద్ నుండి ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకుని ట్రైన్ లో బయలుదేరారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల తెలంగాణ ఉద్యమం నీరుగారిపోతోందని, ఈ సంకేతాలు ఇచ్చేందుకే జగన్ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దీంతో తెలంగాణ ఉద్యమ కారులు వేలాది మంది మానుకోట స్టేషన్ కు చేరుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు సీనియర్ లీడర్లు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. మానకోట రైల్వే స్టేషన్ కు జగన్ ప్రయాణిస్తున్న ట్రైన్ చేరుకోగానే ఉద్యమకారులు వ్యతిరేకంగా నినదాలు చేస్తూ రైల్వే స్టేషన్ చుట్టుముట్టారు. స్టేషన్ నుండి జగన్ మానుకోటలో అడుగు పెట్టకుండా నిలువరించారు. దీంతో రాళ్ల దాడులు జరగగా, ట్రైన్ లో ఉన్న వారు కాల్పులు జరపడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనతో వందలాది మంది ఉద్యమకారులు గాయాల పాలు కాగా కాల్పుల్లో ఒకరు మరణించారు. దీంతో ఒక్కసారిగా ఉద్యమకారులు ఆగ్రహంతో ఊగిపోయారు. చివరకు పోలీసులు వైఎస్ జగన్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటన తరువాత తెలంగాణ అంతట కూడా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిపోయాయి. దీంతో వైఎస్సార్సీపీ తెలంగాణాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొవలసి వచ్చింది.

తాజాగా చెల్లెలు…

2023 ఫిబ్రవరి 19న కూడా మానుకోట దద్దరిల్లిపోయింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్ సింగ్ తండాలో ఆదివారం తెల్లవారు జామున ఉద్రిక్తతలకు వేదికగా మారిపోయింది. ఈ గ్రామంలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నైట్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడంతో ఆందోళన చేసేందుకు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య డాక్టర్ సీతా మహాలక్ష్మి కూడా నైట్ క్యాంప్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఆమెకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్ నైట్ క్యాంపును చుట్టుముట్టి వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బీఆర్ఎస్ కార్యకర్తలను నిలువరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షర్మిలపై అప్పటికే నమోదయిన అట్రాసిటీ కేసుకు సంబందించిన 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఆ తరువాత ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. ఉద్యమ ప్రస్థానంలో అన్న జగన్ ముందస్తు అరెస్ట్ కాగా ఇఫ్పుడు చెల్లెలు అరెస్ట్ కావడం కూడా మానుకోటలోనే కావడం గమనార్హం. వైఎస్ వారసులిద్దరికి మానుకోట ప్రాంతం వ్యతిరేకతను కనబరుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page