నగర శివార్లలోకి తరలిస్తున్న డాగ్ క్యాచ్ టీమ్స్
దిశ దశ, వరంగల్:
అక్కడ శునకాల వేట ప్రారంభం అయింది… డాగ్ క్యాచింగ్ టీమ్స్ ఇదే పనిలో నిమగ్నం అయ్యాయి. ఏక శిలానగరంలోని ఆ ప్రాంగణంలో ఒక్క శునకం కూడా కనిపించకూడదన్న పంథంతో చకాచకా వాటిని పట్టేస్తున్నారు. అసలే దేశ ప్రధాని వస్తుండడంతో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. సభా ప్రాంగణంలో తిరుగుతున్న శునకాలను తరలించే పనిపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.
శనివారం వరంగల్ నగరానికి రానున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప సభ నిర్వహిస్తున్న ప్రాంగణంలో వీధి కుక్కల సంచారం కనిపించడంతో హుటాహుటిన వాటిని అక్కడి నుండి తరలించేందుకు డాగ్ క్యాచర్స్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. దీంతో శుక్రవారం డాగ్ క్యాచర్స్ సభా ప్రాంగణంలో కనిపించిన కుక్కలను పట్టుకునేందుకు వాటి చుట్టూ తిరగుతూ వలలో వేసి నగర శివార్లలోకి తరలిస్తున్నారు. అప్పటికే సభా ప్రాంగణంలో సెక్యూరిటీని పర్యవేక్షించేందుకు చేరుకున్న ఎస్పీజీ కమెండోలు కూడా ఈ శునకాలను చూసి వాటిని ఆ ప్రాంతం నుండి తరలించాలని సూచించారు. అత్యున్నతమైన రక్షణ నడుమ సాగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా నిర్వహిస్తున్న సభాస్థలి ప్రాంతంలో కుక్కలు కనిపించవద్దని స్పష్టం చేయడంతో వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా డాగ్ క్యాచర్స్ టీమ్స్ ను రంగంలోకి దింపింది. విజయ్ సంకల్ప్ యాత్ర సాఫీగా సాగాలంటే ముందుగా అక్కడ తిరుగుతున్న శునకాలను తరిమేయాల్సిన పరిస్థితి ఎదురైందని స్థానికులు కామెంట్ చేస్తున్నారు.