దిశ దశ, జాతీయం:
గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అన్న నానుడి వినే ఉంటాం… ఎలాంటి వస్తువులనైనా మోసుకెళ్లే పని మాత్రమే చేసే గాడిదలకు గంధపు చెక్కల వాసన తెలియదు అనే అర్థం వచ్చే ఈ సామెత వాడుకలో ఉంది. అయితే గంధపు చెక్కల వాసన తెలియని ఆ గాడిదలే ప్రజస్వామ్య భారతంలో తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ గాడిదలు ప్రతి ఎన్నికలప్పుడు తమ విధులను తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. సాయుధ బలగాల రక్షణ వలయం, పోలింగ్ సిబ్బంది తమతో పాటు కలిసి నడుస్తుంటే అవి దర్జాగా గమ్యం వైపు సాగిపోతున్నాయి. తమిళనాడులో ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఈ సీన్ రిపిట్ అవుతూనే ఉంటుంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో కూడా గాడిదలు ఎలక్షన్ డ్యూటీలో చేరిపోయి ఎంచక్కా ఈవీంలను తరలిస్తు ముందుకు సాగాయి. తమిళనాడులోని కొండలు, గుట్టలు విస్తరించి ఉన్న ప్రాంతాలతో పాటు దారితెన్నులేని మారుమూల గ్రామాలకు పోలింగ్ సిబ్బంది చేరుకోవడమే అత్యంత గగనంగా ఉంటుంది. అలాంటిది పోలింగ్ సిబ్బంది తమవెంట ఈవీఎంలతో పాటు పోలింగ్ మెటిరియల్ మోసుకెళ్లాలంటే వారికి చుక్కలు కనిపిస్తాయి. అయితే ఆయా ప్రాంతాల్లో రవాణాకు అత్యంత కీలకంగా ఉపయోగపడే గాడిదలను పోలింగ్ ప్రక్రియకోసం డ్యూటీలు వేయాల్సి వస్తోంది ఎలక్షన్ అధికారులకు. ధర్మపురి, దిండిగల్, ఈరోడ్, నమక్కల్, తేని జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇలాంటి మారుమూల గ్రామాలకు పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు గాడిదలను ఉపయోగిస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని పొలింగ్ బూత్ లలో 300 నుండి 1100 వరకు ఓటర్లు ఉండడంతో వారి ఓటు హక్కును వినియోగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవల్సి వస్తోంది ఎన్నికల అధికారులకు. ధర్మపురిలోని పెన్నాగారం ప్రాంతంలోని కొత్తూరుతో పాటు పలు గ్రామాలు, నమక్కల్ లోని బోతమలైలోని గ్రామాలు గుట్టలపై వెలిసి ఉండడంతో ఎన్నికల సమయంలో గాడిదల ద్వారానే పోలింగ్ మెటిరియల్ తరలిస్తుంటారు. ఈ సారి కూడా పోలింగ్ కు ముందే ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాలకు గాడిదల ద్వారా పోలింగ్ మెటిరియల్ ఒక రోజు ముందే పంపించారు. ఎందుకు పనికిరాని వారిని గాడిదలా ఎందుకు తిరుగుతున్నావ్ అని… కోపం వచ్చినప్పుడు గాడిద కొడక అని ఛీత్కరించుకునే వాళ్లు ఇక నుండి జాగ్రతగా ఉండాలి సుమా. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో గాడిదలు కూడా ఎన్నికల ప్రక్రియలో తమవంతు భాగస్వామ్యాన్ని అందించి బాధ్యతతో మెదులుతున్నాయి కాబట్టి అంటున్నారు కొందరు.