మానేరు నది పర్సనల్ విషయాలు అడగొద్దు…

దిశ దశ, పెద్దపల్లి:

సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యుడు అన్ని వివరాలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తే… ఆ చట్టానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు కొందరు. ఫలనా సమాచారం కావాలని అభ్యర్థిస్తే ఏ వంక పెట్టి తప్పించుకోవాలా అని చూస్తున్నట్టుగా ఉంది కొన్ని విభాగాల యంత్రాంగం తీరు. సమాచారం ఇవ్వండి మహా ప్రభో అని అడిగితే చట్టంలోని ఏదో ఒక క్లాజ్ చూపించి చేతులు దులుపుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తికి చెందిన చిటికేశి సతీష్ సమాచార హక్కు చట్టం ద్వారా తనకు వివరాలను పంపించాలని TSMDC అధికారులను కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక క్వారీల నుండి సేకరించిన ఇసుక కోసం స్టాకు యార్డుల్లో ఎక్కడెక్కడ నిలువ చేశారు, 2024 మే 21 వరకు రీచుల వారిగా స్టాకు యార్డుల్లో ఉన్న ఇసుక పరిమాణం ఎంత ఉంది, 22 మే 20024 నుండి నవంబర్ 20 2024 వరకు ఎంత మేర ఎంత మేర ఇసుకను తరలించారు, అలాగే వాణిజ్య అవసరాలకు, ప్రభుత్వ అవసరాల కోసం ఎన్ని లారీల మేర ఇసుక తీసుకెళ్లారో తెలపాలని సతీష్ తన దరఖాస్తులో కోరాడు. అయితే ఈ సమాచారం వివరాలను తెలియజేయడానికి ఆర్టీఐ చట్టం 8(1) (J) సెక్షన్ కిందకు రాదని, ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాదని, పర్సనల్ విషయం కాబట్టి సమాచారం ఇవ్వమని వెల్లడించారు. TSMDC సమాచార అధికారి రాజశేఖర్ ఈ మేరకు సతీష్ అడిగిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు ప్రత్యుత్తరం పంపించారు. సహజ వనరుల్లో ఒకటైన మానేరు నది నుండి ఇసుక తరలించడమనేది పబ్లిక్ ఇష్యూనే కాదని రిప్లై లెటర్ లో పేర్కొన్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.

You cannot copy content of this page