దిశ దశ, హైదరాబాద్:
ఇసుక రీచుల్లో సాగుతున్న అక్రమ వ్యవహారాలను కట్టడి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు పరోక్షంగా ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉంది. ఓవర్ లోడ్ వల్ల ఇసుక విక్రయంతో వచ్చే ఆదాయం ఒక్కటే కాకుండా… ఇతరాత్ర అంశాలపై కూడా భారం పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. నదుల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుపుతుండడం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఓవర్ లోడ్ కారణంగా రీచులు నిర్వహిస్తున్న గ్రామాల్లో రహదారుల విధ్వంసం కొనసాగుతోంది. సమీప గ్రామాల్లో నివసిస్తున్న వారు కూడా లారీల రాకపోకలతో ధుమ్ము ధూళి బారిన పడి అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారులు కూడా నాశనం అయిపోతున్నాయన్నది వాస్తవం. నేషనల్, స్టేట్ హైవేలు కూడా ఓవర్ లోడ్ కారణంగా దెబ్బతింటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కల్వర్టులు కూడా కూలిపోయాయంటే ఇసుక లారీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిని మరమ్మత్తులు చేయించడానికి ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సి వస్తుండడం వల్ల పరోక్షంగా ఆర్థిక భారం పడుతున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రీచులు కాంట్రాక్టు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ శాతం లారీల్లో మోతాదుకు మించి తరలిపోతున్న ఇసుక విధ్వంసం కోసమే ఖర్చు చేయాల్సి వస్తున్నదన్న విషయాన్ని సర్కారు పెద్దలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆదాయం వస్తుందన్న బూచి మాటున జరగుతున్న నష్టాన్ని కూడా అంచనా వేసి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లారీల యజమానులు ఓవర్ లోడ్ ద్వారా మరింత ఆదాయాన్ని గడించవచ్చని అక్రమాలకు తెరలేపారన్న వాదనలకు భిన్నంగా సాగుతున్నాయి వినతి పత్రాలు ఇస్తున్న తీరు.
అంతా నిర్వాహకులదే…
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీని మార్చి రాష్ట్రం యూనిట్ గా ఓ కార్పోరేట్ కంపెనీకి ఇసుక వ్యాపారం చేసే బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16 నుండే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలు కానుందని కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో లారీ అసోసియేషన్స్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ బాధ్యులు ఇసుక పాలసీ మార్చవద్దని, రీచులను నిర్వహించే కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమాలను కట్టడి చేయాలని వినతి పత్రం అందించారు. తాజాగా ఇసుక లారీల యజమానుల సంఘం ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆదాయానికి రీచుల నిర్వాహకులు గండి కొడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ సంఘం ప్రతినిధులు మైనింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఇసుక పాలసీని మార్చడం వల్ల 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతాయని, రీచుల కేంద్రంగా సాగుతున్న అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని కోరారు. రూ. 2కోట్ల 32 లక్షల 72 వేల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ఓవర్ లోడ్ వ్యవహారాన్ని కట్టడి చేస్తే ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం ఇసుక పాలసీని మార్చే విషయంలో పునరాలోచించాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతుండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని లారీల యజమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.