ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై సరికొత్త వివాదం
దిశ దశ, కరీంనగర్:
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సీనియర్ ఎన్టీరామారావు విగ్రహం ఏర్పాటుపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. వెండితెరపై పౌరాణిక పాత్రలకు జీవం పోసిన ఆయన విగ్రహం సాధారణ మనిషిలా ఉండాలే తప్ప దేవుని వేషధారణలో ఉండకూడదని భారత యాదవ సమితి అంటోంది. ఈ మేరకు ఆదివారం కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం కూడా అందించారు బీవైఎస్ ప్రతినిధులు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం చెరువులో శ్రీకృష్ణుని రూపంలో ఎన్టీరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల రూపంలో మనుషుల ప్రతిమలను ఏర్పాటు చేయడం సరికాదని బీవైఎస్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భగవద్గీతను ప్రభోదించిన శ్రీకృష్ణుడిని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఆరాధిస్తారని అటువంటి దేవదేవుని రూపంలో సిని నటుడు, రాజకీయనాయకుడు కూడా అయిన ఎన్టీరారావు విగ్రహాన్ని లకారం చెరవు మధ్యన ఏర్పాటు చేయడాన్ని ఆపించాలని కోరారు. మానవుడిని దేవుని రూపంలో పెట్టి కొలవడం కుహనా రాజకీయ చర్యేనని, మత విశ్వాసాన్ని రాజకీయం చేసి సమాజంలో అలజడులు సృష్టించే ప్రక్రియ అని వారు ఆరోపిస్తున్నారు. హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుని రూపంలో మానవుని విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇలా విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రక్రియను నిలిపివేయడంతో పాటు దేశ వ్యాప్తంగా కూడా చట్టాన్ని తీసుకరావాలని భారత యాదవ సమితి ప్రతినిధులు బండి సంజయ్ ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్, వర్కింగ్ ప్రసిడెంట్ సిద్ది రమేష్ యాదవ్, నాయకులు చొర్రాజు, శ్రీనివాస్ యాదవ్, తోకల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Disha Dasha
1884 posts
Prev Post