హైదరాబాద్ రోడ్లపై ఆ బస్సులు మళ్లీ దర్శనం ఇవ్వబోతున్నాయి. ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర వేసేందుకు దాదాపు మూడు దశాబ్దాలకు మల్లీ సేవలందించనున్నాయి. అయితే ఈసారి మాత్రం ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ అంటే దర్శనీయ స్థలాలే కాదు… ఆయా ప్రాంతాలను చూసేందుకు వెల్లే వారిని ఎక్కించుకుని తీసుకెళ్లిన డబుల్ డెక్కర్ బస్సులూ తలమానికంగా ఉండేవి. 1990వ దశాబ్దం వరకూ మహానగరంలో డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ప్రయాణీకులు. గత వైభవాన్ని సంతరించుకునే విధంగా డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకరావాలని మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తుండడంతో ఈ మేరకు కేటీఆర్ హామీ ఇవ్వడంతో పాటు ప్రణాళికలు సిద్దం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కూడా కోరారు కేటీఆర్. డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు సన్నాహాలు చేసిన అధికార యంత్రాంగం ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ-డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ మరో వారంలో ప్రారంభించనుంది, ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్‌లను నమోదు చేసుకోవాలని ఆహ్వానించనుంది. బిడ్ దక్కించుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్‌ఆర్‌టీసీతో ఒప్పందం చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు
టీఎస్‌ఆర్‌టీసీ సదరు కంపెనీకి ఫిక్స్‌డ్ అద్దె చెల్లించనుంది. ఛార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్‌ఆర్‌టీసీ చూసుకోనుంది. ఇందులో ప్రైవేటు వారి నిర్ణయాలకు ఎలాంటి అవకాశం కల్పించవద్దని ఆర్టీసీ భావిస్తోంది. డబుల్ డెక్కర్ బస్సుల కోసం పెద్దమొత్తంలో డబ్బు వెచ్చించి కొనడం కన్నా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని కొంత మేర తగ్గించుకునే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ-డబుల్ డెక్కర్ బస్సులు ఫ్లైఓవర్లు ఉన్న ప్రాంతాల్లో తిరిగే అవకాశం లేదని, మొదట మూడు రూట్లను ఎంపిక చేశారని సమాచారం. పటాన్‌చెరు-కోటి, జీడిమెట్ల-సీబీఎస్, అఫ్జల్‌గంజ్-మెహదీపట్నం రూట్లలో ఈ-డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి.

గత స్మృతులు…
1990వ దశాబ్దంలో హైదరాబాద్ నగరంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులను ఆకర్షించేవి. సిటీ బస్సులతో పాటు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. డబుల్ డెక్కర్ బస్సుల్లో ఎక్కి ప్రయాణం చేసేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు హైదరాబాద్ కు వెల్లినప్పుడు ఆసక్తి చూపే వారు. అంతేకాకుండా హైదరాబాద్ లో చదువుకునే విద్యార్థులు కూడా ఈ బస్సుల్లో తిరిగేందుకు ఇంట్రస్ట్ చూపే వారు. అయితే కాలక్రమేణ అప్పుడు నగరవాసులకు సేవలందించిన డబుల్ డెక్కర్ బస్సుల వినియోగం గణనీయంగా తగ్గిపోయి వాటి ఉనికే లేకుండా పోయాయి. తిరిగి ఇప్పుడు మళ్లీ ఈ బస్సులు రానుండడంతో అప్పటి తరంలో ఆసక్తి రేకుత్తుతుంటే… నేటి తరంలోనూ ఇంట్రస్ట్ పెరిగిపోతోందని చెప్పాలి.