మరొక్కసారి ఛాన్స్ ప్లీజ్..!

దిశ దశ, జగిత్యాల:

తనకు ఇవే చివరి ఎన్నికలు తరువాత నేను ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉంటానని మరో ఎమ్మెల్యే ప్రకటించడం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే చేసిన ఓ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగిత్యాల నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఓ సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నాకైతే మరొక్క సారి గెలవాలని ఉంది… నాకు మరో సారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా… ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనే నాకు లేదు… అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎన్నికల బరిలో నిలిచే ఆలోచనలో లేనని డాక్టర్ సంజయ్ కుండ బద్దలు కొట్టారు. 2014లో తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ ప్రకటించి ఆ తరువాత వేరే ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఆయన ఆయన కుటుంబ సభ్యులో బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నారని తనకు అలాంటి ఉద్దేశ్యం మాత్రం లేదని, మాట తప్పేది లేదని ప్రకటించిన ఎమ్మెల్యే పరోక్షంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై వ్యంగోక్తులు విసిరారు.

ఇద్దరిది ఆదే మాట..!

9 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు ఇవే చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో అప్పుడు జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని అక్కున చేర్చుకుని అధికార పార్టీ నుండి పోటీ చేసిన డాక్టర్ సంజయ్ ని ఓడించారు. అప్పుడు కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ జగిత్యాలలో జీవన్ రెడ్డి విజయ కేతన ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఎంపీ కవిత, సంజయ్ లు వ్యూహాత్మకంగా వ్యవహరించి జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. కవిత తాను పోటీ చేసినచోట కూడా అంత సీరియస్ గా పనిచేయలేదన్న వాదనలు ఆ పార్టీలో వినిపిస్తుంటాయి. అయితే ఇందుకు రివైంజ్ తీసుకున్న జీవన్ రెడ్డి తెరవెనక పావులు కదిపి పరోక్షంగా, ప్రత్యక్ష్యంగా కవితను ఎంపీగా ఓడించడంలో కీలక భూమిక పోషించారు. గ్రాడ్యూయేట్ కానిస్టెన్సీ ఎమ్మెల్సీగా బరిలో నిలిచి మళ్లీ చట్ట సభలోకి ఎంట్రీ ఇచ్చిన జీవన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి సారించి పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. తన దృష్టినంతా కూడా జగిత్యాలపైనే సారించడంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ 9 ఏళ్ల క్రితం జీవన్ రెడ్డి ప్రచారాస్త్రంగా వాడుకున్న రిటైర్మెంట్ ప్రకటనను తెరపైకి తీసుకొచ్చారు. ఆయనలా కాకుండా తాను మాత్రం 2028 ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలోనే లేనని స్పష్టం చేస్తున్నారు. డాక్టర్ సంజయ్ పై గెలిచి తీరాలన్న సంకల్పంతో జీవన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారన్నది నిజం. ఇప్పటికే అన్ని వర్గాల వారి దరి చేరే పనే లక్ష్యంగా పెట్టుకున్న జీవన్ రెడ్డి ఊరు వాడ కలియతిరుగుతున్నారు. దీంతో జగిత్యాలలో తనకు అనుకూలమైన వాతావరణాన్ని తాటిపర్తి క్రియేట్ చేసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. ఈ క్రమంలో డాక్టర్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి డాక్టర్ సంజయ్ లు పోటీ చేస్తే ఇద్దరు కూడా రిటైర్మెంట్ పల్లవి ఎత్తుకున్న వారే కావడం గమనార్హం.

ఆ పరిస్థితులు రిపిట్ అవుతాయా..?

అయితే 2014 ఎన్నికల్లో తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని ఇవే చివరి ఎన్నికలంటూ జీవన్ రెడ్డి చేసిన ప్రచారం సక్సెస్ అయింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో స్వరాష్ట్ర కలను సాకరం చేయడంలో కీలక భూమిక పోషించిన గులాభి జెండాకే జగిత్యాల ఓటర్లు జై కొడ్తారన్న అంచనాలను జీవన్ రెడ్డి ఇచ్చిన నినాదం తలకిందులు చేసింది. దీంతో తొలి ప్రయత్నంలో డాక్టర్ సంజయ్ విఫలం కాగా కల్వకుంట్ల కవిత తన పంథాన్ని నెగ్గించుకోలేకపోయారు. ఉద్యమ నేత తనయ ప్రత్యక్ష్యంగా కార్యరంగంలోకి దూకినా అధికార పార్టీ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో అప్పుడు జీవన్ రెడ్డి వేసిన రిటర్మైంట్ ఎత్తు వందకు వంద శాతం సఫలం అయింది. అయితే తాజాగా ఇదే నినాదాన్ని డాక్టర్ సంజయ్ ఎత్తుకోవడంతో అందరి దృష్టి అటువైపు మళ్లిందని చెప్పాలి. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ నినాదానికి ప్రభావితులై జగిత్యాల ఓటర్లు ఎంతమేర ఆయన్ని అక్కున చేర్చుకుంటారోనన్నది తేలాలంటే ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు.

You cannot copy content of this page