రాజన్న ఆలయంలో అపచారం… డ్రెస్ కోడ్ విధానానికి మంగళం

దిశ దశ, వేములవాడ:

దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారే నిబంధనలు పాటించడం లేదు. తెలంగాణాలోనే అతి పెద్ద శైవ క్షేత్రంలోనే డ్రెస్ కోడ్ ను విస్మరిస్తే సాధారణ ఆలయాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆలయంలో అపచారం జరిగితే కఠినంగా వ్యవహరించాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులే తప్పటడుగులు వేస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే… రాజన్స సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ప్రావిడెంట్ ఫండ్ ఫండ్ సౌత్ జోన్ అడిషనల్ సెంట్రల్ కమిషనర్ వైశాలి దాయల్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయంలో కొడె మొక్కుతో పాటు రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆమెకు సాంప్రాదాయం ప్రకారం స్వామి వారి ఆశీర్వచనం అందించారు. వేదపండితుల ఆశీర్వచన కార్యక్రమంలో భాగంగా ఏఈఓ ప్రతాప నవీన్ ఆమెకు స్వామి ప్రసాదాన్ని అందించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయంలో ఏఈఓ ప్రతాప నవీన్ కనీసం డ్రెస్ కోడ్ కూడా పాటించకపోవడం విస్మయం కల్గిస్తోంది. వాస్తవంగా ఆలయంలో విధులు నిర్వర్తించే వారు ఖచ్చితంగా ధవళ వస్త్రాలు ధరించాలన్న నిబందనలు ఉన్నాయి. తెలుపు రంగు దుస్తులు మెడలో పంచె విధిగా వేసుకుని డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖలో డ్రెస్ కోడ్ ను విధిగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఏఈఓ ప్రతాప నవీన్ మాత్రం జీన్స్ పాయింట్ సాధారణ షర్టు వేసుకుని ప్రసాదాన్ని ప్రావిడెంట్ ఫండ్ సౌత్ జోన్ అడిషనల్ సెంట్రల్ కమిషనర్ కు అందించడం గమనార్హం. ఆలయం విధుల్లోకి డ్రెస్ కోడ్ పాటించకుండా రాకూడదన్న నిభందనలు ఉంటే… ఇక్కడ ఓ ఉన్నతాధికారికి కూడా సివిల్ డ్రెస్ లో ప్రసాదాలను అందించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. నాలుగో తరగతి ఉద్యోగుల నుండి ఈఓ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా ధవళ వస్త్రాలు వినియోగించాలని దేవాదాయ శాఖ నిబంధనలు చెప్తున్నా ఏఈఓ స్థాయి అధికారి ఇలా డ్రెస్ కోడ్ లేకుండానే డ్యూటీలో ఉండడం గమనార్హం. అధికారి హోదాలో ఉన్నవారే ఇలా వ్యవహరిస్తే కింది స్థాయి ఉద్యోగులు కూడా ఇలాగే ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవల్సి ఉందని భక్తులు అంటున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రంలోనే ఇలా వ్యవహరిస్తే ఎలా అన్ని కూడా అంటున్న వారూ లేకపోలేదు.

You cannot copy content of this page