సతీసహగమనం చేస్తానన్న జవాన్ భార్య

దంతెవాడలో హృదయ విదారకర ఘటన

ఒప్పించిన బంధువులు

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టులు దంతెవాడ జిల్లాలో మందుపాతర పేల్చిన ఘటనలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఈఘటనలో మృత్యువు ఒడిలో చేరిన ఓ జవాన్ భార్య సతీసహగమనం చేస్తానంటూ చితిపైకి చేరిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నిండు నూరేళ్లు కలిసి జీవనం సాగిస్తామని ఏడగడుగులు వేసిన తన భర్త కానరాని లోకాలకు వెల్లడాన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారామె. దీంతో ఆమె తన భర్తతో పాటే తననూ కూడా సజీవ దహనం చేయాలంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చితిపై పడుకోవడం స్థానికులను కలిచి వేసింది. అత్యంత విషాదకరమైన ఈ సన్నివేశాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఘెల్లుమని ఏడవడంతో ఆ అటవీ ప్రాంతమంతా కూడా అర్తానాదాలతో దద్దరిల్లిపోయింది. దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చిన ఘటనలో 10 మంది డీఆర్జీ జవాన్లు, ఒక డ్రైవర్ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మందుపాతర పేల్చివేత ఘటనలో చనిపోయిన జవాన్ల మృతదేహాలకు నివాళులు అర్పించిన తరువాత వారి స్వగ్రామాలకు పంపించారు అధికారులు. బీజాపూర్ జిల్లా నిరం గ్రామానికి చెందిన లఖ్ము మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. జవాన్ లఖ్ముకు అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామ సమీపంలో చితిని సిద్దం చేయగా ఆయన భార్య తులే మద్కామి తాను కూడా భర్తతోనే కలిసి అనంతవాయువులో కలిసిపోతానంటూ చితిపై పడుకున్నారు. జీవిత భాగస్వామిగా ఇద్దరం ఒక్కటైన రోజు చివరి శ్వాస వరకూ కలిసే జీవిస్తామనికున్నామని, మందుపాతర రూపంలో తన భర్త తనకు దూరం అయ్యాడంటూ మద్కామి కన్నీరుమున్నీరుగా విలపించారు. వైవిహిక బంధంతో ఒక్కటైనందును తాను కూడా ఆయనతో పాటే చివరి శ్వాస విడుస్తానంటు రోధించిన తులే మద్కామి తన భర్తతో పాటు తనను కూడా ఇదే చితిపై దహనం చేయాలంటూ అభ్యర్థించిన తీరు స్థానికులను కలిచివేసింది. సతీసహగమనాన్ని మరిపించే విధంగా లఖ్ము భార్య తులే మద్కామి భర్తతో పెనవేసుకున్న బంధాన్ని గుర్తు చేసుకున్న వారి బంధువులూ, లఖ్ము చివరి చూపు చూసేందుకు వచ్చిన వారంతా చలించిపోయారు. ఓ వైపున రోధిస్తూనే మరో వైపున తులే మద్కామిని మెప్పించేందుకు ఆదివాసీ బిడ్డలు తీవ్రంగా శ్రమించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని, వారిని దిక్కులేని వారిని చేయకూడదంటూ బంధువులు సర్ది చెప్పి ఒప్పించడంతో చివరకు ఆమె చితిపై నుండి కిందకు దిగారు. ఆ తరువాత జవాన్ లఖ్ము అంత్యక్రియలు నిర్వహించారు వారి బంధువులు. 2016 నుండి డీఆర్జీ జవాన్ గా సేవలందిస్తున్న లఖ్ముకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

You cannot copy content of this page