కంది ఐఐటీ బృందం అద్భుత ప్రతిభ…
దిశ దశ, హైదరాబాద్:
క్రియేటివిటీతో కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయనగానే వేరే దేశంలో అయి ఉంటుందన్న భావన సగటు భారతీయుడిలో రావడం సహజం. కానీ అలాంటి అద్భుతాలు మన దేశంలోనూ సృష్టిస్తామంటోంది నేటి తరం. తమ ఆలోచనలతో ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నారు హైదరాబాద్ సమీపంలోని కంది ఐఐటీ నిపుణులు. తాజాగా ఇక్కడ రూపుదిద్దుకున్న డ్రైవర్ లెస్ కారే ఇందుకు నిదర్శనం.
క్రియేటివిటీ ఇదే…
కంది ఐఐటీ డైరక్టర్ మూర్తి, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మీల నేతృత్వంలోని బృందం డ్రైవర్ లెస్ కారును తయారు చేసింది. డ్రైవర్ లెస్ కారు అనగానే ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం కానీ, రోడ్లపై ఎదురయ్యే వాహనానలను ఢీ కొడితే ప్రమాదాలు జరుగుతాయన్న అనుమానం రావడం సహజం. సాధారణంగా డ్రైవర్ లెస్ కారు రోడ్లపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ కు అనుగుణంగా ఎలా నడుస్తుందన్నదే అసలు సమస్య. వాహనాల రాకపోకలు, పశువులు రోడ్లపైకి వచ్చినప్పుడు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్ స్టాపర్లు వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తుందా అన్న సందేహం రాకమానదు. ఈ వాహానాలు ట్రాఫిక్ అవాంతరాలు ఎదురుకాని ప్రాంతాల్లో మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వస్తుంటాయి. ఇలాంటి అన్ని రకాల సమస్యలను అధిగమించే విధంగానే ఈ డ్రైవర్ లెస్ కారును తీర్చదిద్దుతున్నారు నిపుణులు. తాము తయారు చేసిన ఈ డ్రైవర్ లెస్ కారు లిమిటెడ్ ఏరియాలకే పరిమితం కాకుండా సాధారణ రోడ్లపై కూడా నడిచేందుకు అనుగుణంగా ఉన్నట్టయితేనే సక్సెస్ అయినట్టని భావిస్తున్న ఐఐటీ నిపుణులు దానిని అందుకు అనుగుణంగా తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. తుది దశకు చేరుకున్న వీరి ప్రయత్నాల ఫలితం త్వరలో తెలంగాణ ప్రధాన రోడ్లపై సాక్షాత్కరించనుంది.
వెన్నుదన్నుగా నిలుస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కంది ఐఐటీలో రూపుదిద్దుకున్న డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బృందాన్ని అభినందించారు. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈడ్రైవర్ లెస్ కారుకు సాంకేతికంగా మరిన్ని మెరుగులు దిద్దే పనిలో నిమగ్నం కావడం అభినందనీయం అన్నారు. త్వరలో తెలంగాణతో పాటు భారత దేశ రోడ్లపై నడిపించేందుకు సిద్దమవుతున్న డ్రైవర్ లెస్ కారును సిద్దం చేస్తున్న హైదరాబాద్ ఐఐటీ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని వెల్లడించారు. ఇలాంటి నూతన ఆవిష్కరణలకు వేదికగా తెలంగాణలోని ఐఐటీలు తయారు కావాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఐఐటీ నిపుణులు కొత్త ఆవిష్కరణలకు సిద్దమవుతున్న తీరు ఆదర్శనీయమన్నారు. భవిష్యత్తులో వినూత్న ఆలోచనలతో సృజనాత్మకతకు కార్యరూపం దాల్చినట్టయితే అద్భతమైన ఆవిష్కరణలు పట్టుకొస్తాయన్నారు. దేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శిగా తెలంగాణ ఐఐటీలు కేరాఫ్ అడ్రస్ గా మారాలని పిలుపునిచ్చారు.