దిశ దశ, హైదరాబాద్:
మాదక ద్రవ్యాల వినియోగానికి, క్రయ విక్రయాలకు అడ్డాగా మారిన హైదరాబాద్ నగరంపై నిఘా వర్గాలు హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నాయి. యువత భవితను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలు కేవలం హైదరాబాద్ వాసులకు విక్రయించడమే కాదు ఇక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా డీఆర్ఐ అధికారుల బృందం కీలక సమాచారాన్ని అందుకుని వాస్తవాలను నిగ్గు తేల్చింది. హైదరాబాద్ కొరియర్ సర్వీసుల ద్వారా 3 కిలోల ఎఫెడ్రిన్ తరలిపోతోందని సమాచారం అందుకున్న హైదరాబాద్ జోనల్ డీఆర్ఐ అధికారుల బృందం టాస్క్ వేసి మరి పట్టుకుంది. రూ. 60 లక్షల విలువ చేసే ఎఫెడ్రిన్ ను ప్యాక్ చేసి తరలిస్తుండగా సీజ్ చేశారు. ఈ డ్రగ్ తో పాటు ఇద్దరు అనుమానిత వ్యక్తులను కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ కు తరలించేందుకు మాదక ద్రవ్యాల స్మగ్లర్లు వేసుకున్న స్కెచ్ విఫలం అయినట్టయింది. రెండు ప్యాకెట్లలో ఎపెడ్రిన్ ను ఉంచి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొరియర్ ద్వారా ఎగుమతి చేయాలనుకున్నప్పటికీ డీఆర్ఎఐ అధికారుల కనుసన్నల్లోంచి తప్పించుకోలేకపోయారు. కొరియర్ ఆఫీసు వద్ద ఇద్దరు అనుమానితులను, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో బారీ రాకెట్ ను ఛేదించగలిగారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) యాక్టు 1985 ప్రకారం ఈ కేసు దర్యాప్తు చేయనున్నారు. డ్రగ్స్ ఎగుమతి వెనక ఉన్నదెవరు..? ఎక్కడి నుండి తెప్పించారు..? తదితర విషయాలను తెలుసుకునే పనిలో డీఆర్ఐ అధికారులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ స్టాక్ పాయింట్స్ ఎక్కడున్నాయి, ఎంత మొత్తంలో నిలువ ఉంచారు అన్న వివరాలను కూడా సేకరించనున్నట్టుగా తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను విచారించినట్టయితే భారీ రాకెట్ గుట్టు బట్టబయలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.