దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్, సాక్ష్యాల తారుమారు కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ప్రణిత్ రావును విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఏడు రోజుల పాటు విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు వారం రోజుల పాటు ప్రణిత్ రావును కస్టడీకి అనుమతించడంతో ఆదివారం ఉదయం చంచల్ గూడ జైలు నుండి ప్రణిత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
వివిధ కోణాల్లో…
ఎస్ఐబీ ఎస్ఓటీ డీఎస్పీ ప్రణిత్ రావును అదుపులోకి తీసుకున్న తరువాత పోలీసులు పలు వివరాలను సేకరించే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఓటీ ఆధ్వర్యంలో ఏఏ ఆపరేషన్లు చేపట్టారు..? సీడీఆర్ తో పాటు ఫోన్ ట్యాపింగ్ రికార్డలను ధ్వంసం చేయడానికి కారణం ఏంటీ..? ఇందుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు.. తదితర విషయాలపై పోలీసులు కూపీలాగనున్నారు. ఎన్నికల సమయంలో ఏం చేశారు..? వార్ రూమ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు..? అందులో ఎవరెవరు ఉన్నారు..? ఎస్ఐబీ కార్యాలయానికి వార్ రూమ్స్ కు ఉన్న లింకు ఏ విధంగా ఉండేది..? ట్రాకింగ్, ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలను ఎవరెవరికి షేర్ చేసేవారు..? ఎన్నికల సమయంలో ఎంతమందిని వేటాడారు..? వారి నుండి రికవరి చేసిన నగదు ఏం చేశారు అన్న విషయాలపై కులంకశంగా ఆరా తీయనున్నట్టుగా తెలుస్తోంది.
మొబైల్ డాటా ఆధారంగా…
ఇప్పటికే ప్రణిత్ రావు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు డాట రిట్రైవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిట్రైవ్ ద్వారా వాట్పస్ ఛాటింగ్ ఆధారంగా కూడా ప్రణిత్ రావును ప్రశ్నించనన్నారు దర్యాప్తు అధికారులు. సపరేట్ గా ఏర్పాటు చేసిన వార్ రూమ్స్ కేంద్రీకృతంగా జరిగిన లావాదేవీలపై కూడా వివరాలు సేకరిస్తారన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ప్రణిత్ రావు ఈ పని చేయడానికి కారణం ఏంటీ..? పోలీసు విభాగంలో ఏఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు..? అనధికార వ్యక్తుల జోక్యం ఉందా..? ఉన్నట్టయితే ఎవరెవరు ఈ డాటా సేకరించాలని ఆదేశించారు..? సేకరించిన డాటా ఎవరెవరికి చేరవేశారు తదితర విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నట్టు సమాచారం. ప్రధానంగా హార్డ్ డిస్కులు మాయం చేశారా..? అన్న విషయంపై ప్రత్యేకంగా ప్రశ్నించనున్నారు. హార్డ్ డిస్కులు మాయం చేసి… సీడీఆర్ ఉన్న పేపర్లు కాల్చివేయడంతో ఎస్ఐబీకి సంబంధించిన ఇతరాత్ర కీలక సమాచారం అంతా కూడా నాశనం అయిపోయిందని అధికారులు గుర్తించారు.