లాఠీ… తుపాకి పక్కనపెట్టి… కుల వృత్తిని ప్రదర్శించిన పోలీసు అధికారి…

దిశ దశ, వేములవాడ:

ఓ చేతిలో లాఠీ… మరో చేతిలో గన్ పట్టుకుని దర్జాతనం చూపించాల్సిన ఓ పోలీసు అధికారి కమ్మరి కొలిమి వద్ద కూర్చుని పని చేస్తున్నాడు. యూనిఫాంతోనే ఓ ఇనుప ముక్కను వేడి చేసి వస్తువుగా మార్చే పనిలో నిమగ్నం అయ్యారు. అటుగా వెల్తున్న వారంతా అతన్ని గమనించి కమ్మరే పోలీసు అధికారి డ్రెస్ వేసుకుని పని చేస్తున్నాడనుకున్నారు. అయితే ఆ కమ్కరి కొలిమికి సమీపంలోనే అంగరక్షకులూ ఉండడంతో ఆయన నిజమైన పోలీసు అధికారేనని గుర్తించారు. తీరా అతని వద్దకు వెల్లి చూస్తే తమ వద్ద పని చేస్తున్న డీఎస్పీ ఎంటీ ఇలా పని చేయడం ఏంటీ అని ఆశ్యర్యపోతూ అక్కడే ఉండిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే… రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీ కె నాగేంద్ర చారి సోమవారం చందుర్తి మండలంలో పర్యటించారు. మల్యాల గ్రామం మీదుగా వెల్తున్న ఆయనకు రోడ్డు పక్కన కమ్మరి కొలిమిలో పనిముట్లు తయారు చేస్తున్న విషయం కంటపడింది. వెంటనే తన వాహనం దిగి కొలిమి వద్దకు చేరుకుని ఓ ఇనుప ముక్కను పనిముట్టుగా తయారు చేశారు. ఓ వైపున కొలిమిలో ఇనుప ముక్కను వేడి చేస్తూ మరో వైపున దానిని పనిముట్టుగా మార్చేందుకు సుత్తెతో కొట్టారు. డీఎస్పీ నాగేంద్ర చారి కమ్మరి పనిని చేసిన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా నాగేంద్ర చారీ విశ్వ బ్రాహ్మణుల సామాజిక వర్గాల్లో ఒకటైన కమ్మరి కులానికి చెందిన వారు. పంచ వృత్తుల్లో ఒకటైన కమ్మరి కులానికి చెందిన ఆయన చిన్ననాడు తన ఇంట కులవృత్తిని చేస్తూనే ఉన్నత చదువులు చదివి 1995 బ్యాచ్ ఎస్ఐగా పోలీసు విభాగంలో చేరారు. ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన నాగేంద్ర చారీ డీఎస్పీగా పదోన్నతి పొంది వేములవాడలో పని చేస్తున్నారు. తన కులవృత్తికి సంబంధించిన కమ్మరి కొలిమిని చూసి తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుని తానూ ఓ పనిముట్టు తయారుచేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. వెంటనే మల్యాలలోని ఆ కొలిమి వద్ద కూర్చుని ఓ పనిముట్టు కోసం ఇనుప ముక్కను తీర్చిదిద్దారు. సాధారణంగా ఓ హోదాలోకి చేరుకోగానే తామీ సామాజిక వర్గానికి చెందిన వారమని చెప్పుకునేందుకు కూడా వెనుకడుగు వేసే ఈ కాలంలో డీఎస్పీ స్థాయిలో ఉన్న నాగేంద్ర చారీ మాత్రం సహజత్వాన్ని ప్రదర్శిస్తూ తన కులవృత్తికి ఇచ్చిన ప్రాధాన్యతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పోలీసు విభాగంలోనే పని చేస్తున్న నాగేంద్ర చారి చిన్నప్పడు చేసిన పనిని ఇప్పటికీ మర్చిపోకుండా ఉండడంపై కూడా పలువురు అభినందిస్తున్నారు. 

You cannot copy content of this page