పీసీసీ రేసులో శ్రీధర్ బాబు..?

దిశ దశ, హైదరాబాద్:

టీపీసీసీ చీఫ్ పదవి కాలం ముగియడంతో ప్రత్యామ్నాయ నాయకుని కోసం అధిష్టానం చూస్తోంది. క్యాబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసే విషయంలో ఏఐసీసీ ప్రద్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు కూడా ఢిల్లీకి వెల్లిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారాన్ని చక్కదిద్దిన తరువాత మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన అంశాలు చర్చించిన అధిష్టానం పీసీసీ చీఫ్ నియామకం కూడా గురించి కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే బావుంటుందన్న విషయంపై కసరత్తులు చేస్తున్న అధిష్టానం దృష్టిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా శ్రీధర్ బాబు విషయంలో సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుక పోతున్న శ్రీధర్ బాబుకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే అస్మదీయులే ఉంటారు కానీ అసమ్మతి మాత్రం ఉండదని భావిస్తున్నట్టుగా సమాచారం. సీఎం కూడా శ్రీధర్ బాబుకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం వద్ద సుముఖత వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. బలమైన నాయకుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై పట్టు ఉన్న వ్యక్తి అయితే బావుంటుందని, వర్గ పోరుకు దూరంగా, క్లీన్ చిట్ ఉన్న నేతకు బాధ్యతలు అప్పగించినట్టయితే పార్టీకి కూడా మేలు జరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. దీంతో శ్రీధర్ బాబుకు అదనంగా పీసీసీ బాధ్యతలు కూడా అప్పగించినట్టయితే అన్నింటా మంచిదేనన్న యోచనలో ఉన్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page