దిశ దశ, హైదరాబాద్:
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని ఒప్పించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే దృష్టి పెట్టినట్టుగా ఉంది. తాజాగా హైదరాబాద్ చేరిన జీవన్ రెడ్డికి నచ్చ చెప్పేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. కొద్ది సేపటి క్రితం జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు మంతనాలు జరుపుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తీరుపై గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. కొన్ని సమీకరణాల వల్ల పార్టీలో జాయినింగులను ప్రోత్సహించాల్సి వచ్చిందని, ఏఐసీసీ పెద్దలు కూడా మీ పట్ల సానుకూలంగా ఉన్నారని వివరిస్తున్నట్టుగా సమాచారం. అయితే జీవన్ రెడ్డి మాత్రం జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
ఛైర్మెన్ అపాయింట్ మెంట్
ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్ తీసుకున్నారు. ఒంటిగంటకు తన రాజీనామా లేఖ సమర్పించేందుకు సమయం కోరారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరుపుతున్నారు. దీంతో జీవన్ రెడ్డి రాజీనామా సమర్పించడం తాత్కాలికంగా వాయిదా పడింది.