తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం ఎప్పటినుంచో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ నేతలతో పాటు మిగతా పార్టీలన్నీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ గతంలో ట్వీట్ చేశారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంటోంది.

ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు. ఫిబ్రవరి చివరిలో అసెంబ్లీని రద్దు చేసే అవకాశముందని తెలిపారు. అందుకే డిసెంబర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు నిర్వహించకపోతే అసెంబ్లీ రద్దు అవుతుందని రేవంత్ తెలిపారు. సెప్టెంబర్ 13న వర్షాకాల సమావేశాలు ముగిశాయని, మార్చితో ఆరు నెలలు పూర్తి అవుతుందన్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలు జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రిస్తారని అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు తెలంగాణకు చెందిన తమ పార్టీకి చెందిన ఓ వ్యాపారవేత్తను కేసీఆర్ ఫాంహౌస్‌కి పిలిపించుకుని మాట్లాడారని రేవంత్ ఆరోపించారు. సునీల్ కనుగోలు ఆఫీసుపై దాడి చేయడం ద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 120 నుంచి 130 సీట్లతో గెలవబోతుందని కేసీఆర్ తెలుసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ సీట్లను తగ్గించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్రను కుమరస్వామి తెలుసుకున్నారని, అందుకే ఖమ్మం సభకు ఆయన రాలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సభకు కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న నేతలందరూ వచ్చారని, కుమారస్వామి ఎందుకు రాలేదో కేసీఆర్ చెప్పగలరా అని రేవంత్ సవాల్ విసిరారు. మొత్తానికి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ అనేకసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ముందస్తు ఎన్నికల ప్రచారానికి మాత్రం అసలు చెక్ పడటం లేదు.

You cannot copy content of this page