నాలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు…
దిశ దశ, మేడారం:
మేడారం అటవీ ప్రాంతమే కేంద్ర బిందువుగా భూకంపం చోటు చేసుకున్నట్టుగా అధికారులు నిర్దారించారు. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో భూకంపం సంభవించినట్టుగా తేల్చారు. ఈ భూకంపం ప్రభావం తెలంగాణ, ఏపీ, చత్తీస్ గడ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాల్లో సంభవించినట్టుగా అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేట్ పై 5.0గా నమోదయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. భూకంపానికి గల కారణాలు ఏమిటీ అన్న విషయంపై సిస్మలాజికల్ విభాగం నిపుణులు పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు.
అదే స్పాట్…
ములుగు జిల్లా కేంద్రంగానే భూకంపం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 4న ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ప్రకృతిలో పెను మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే. సుడిగాలుల బీభత్సం కారణంగా 50 నుండి 70 వేల మేర చెట్లు నేల కూలిపోయాయి. సుడిగాలి తీవ్రత ఏ స్థాయిలో చోటు చేసుకుందంటే… చెట్ల వడిపెట్టినట్టుగా చుట్టుకపోగా ఇరువైపులా వంగిపోయాయి. మరికొన్ని చెట్లు అయితే చీలికలు కాగా… ఇంకొన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించబడ్డాయి. దేశంలోనే అత్యంత అరుదైన ఘటనగా అటవీ శాఖ అధికారులు సెప్టెంబర్ 4న జరిగిన ఘటనపై వివరించారు. పరిశోధనలు జరిపేందుకు నిపుణులను కూడా రంగంలోకి దింపుతున్నామని అటవీ శాఖ అధికారులు అప్పుడు ప్రకటించారు. తాజాగా బుధవారం వచ్చిన భూకంపం కూడా ఇదే ప్రాంతంలో సంభవించిందని సిస్మోలాజికల్ విభాగం నిర్దారించడం గమనార్హం. మేడారంలో గాలి దుమారం రేకెత్తిన ఘటన జరిగిన సరిగ్గా మూడో నెల రోజునే భూకంపం సంభవించిడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ మొదటి వారంలో మేడారం అడవుల్లో ప్రకృతి ప్రళయం సృష్టించగా, డిసెంబర్ 4న భూకంపం సంభవించడం గమనార్హం.
పరిశోధనలకు సవాల్…
అయితే మేడారం అడవుల్లో సెప్టెంబర్ నెలలో చోటు చేసుకున్న సుడిగాలుల ప్రభావంపై అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ… సహజంగా చెట్లు భూమి లోపల కూడా విస్తరించుకుంటాయని, వేర్ల ద్వారా భూమి లోపలి నుండి వృక్షాలకు అవసరమైన పోషక విలువలు అందుతుంటాయని అన్నారు. అయితే ములుగులో మాత్రం ఈ పరిస్థితికి భిన్నంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలోని గాలిలోనే చెట్లకు అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో భూమి లోపలకు చెట్లు విస్తరించడం లేదని వెల్లడించారు. గాలి దుమారం వల్ల భారీ వృక్షాలు కూడా నేలకూలిపోవడానికి కారణం అయి ఉంటుందని బావిస్తున్నామన్నారు. అప్పుడు ఇవే అటవీ ప్రాంతంలో వాటర్ స్పౌట్స్ కూడా ఏర్పడడంతో అక్కడ నీటి వనరులు కూడా విస్తరింగా ఉండడమే కారణమని అంచనా వేశారు. కానీ తాజాగా ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపం నిపుణుల పరిశోధనలకు సవాల్ విసురుతోంది. అప్పుడు కేవలం చెట్లు మాత్రమే ధ్వంసం అయ్యాయి. కానీ ఇప్పుడు భూకంపం కూడా అదే అటవీ ప్రాంతం కేంద్రీకృతంగా చోటు చేసుకోవడంతో పరిశోధకులు కొత్త కోణంలో శోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.