ఇండోనేషియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 162 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 700 మంది గాయాలయ్యాయి. భకంపం కారణంగా కూలిపోయిన భవనాలు, ఇతరాత్ర శిథిలాల నడుమ ఇంకా అనేక మంది చిక్కుకొని ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండోనేషియా అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంప కారణంగా వందలాది భవనాలు కుప్పకూలిపోయాయని దీనివల్ల మృతుల సంఖ్యను నిర్థిష్టంగా చెప్పలేని పరిస్థితి తయారైంది ఇండోనేషియా అధికార వర్గాలు చెప్తున్నాయి. పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రీకృతం అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. దీంతో ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ ఆస్నత్రితో పాటు వందలాది భవనాలు భూకంప తీవ్రత వల్ల నేలమట్టమయ్యాయి. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని ఆ ప్రాంతంలో నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ భూకంప తీవ్రగ తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమై ఎత్తైన భవనాల నుండి ప్రజలను ఖాళీ చేయించే పనిలో నిమగ్నం అయ్యారు. భూకంప కారణంగా ఇండ్లు, భారీ భవనాలు ధ్వంసం కావడంతో వాటి శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నామని సియాంజుర్ పాలనాధికారి హెర్మన్ సుహెర్మాన్ తెలిపారు. మొదటి సారి వచ్చిన భారీ భూకంపం తరువాత కూడా 25 సార్లు ప్రకంపనలు నమోదయినట్టు అధికారులు తెలిపారు. తరుచూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నందున ప్రజలు భవనాలను వీడి ఆరుబయట ఉండాలని బీఎంకేజీ చీఫ్ ద్వికోరిటా కర్ణావతి సూచించారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు రంగంలోకి, సహాయక చర్యలు ప్రారంభించాయి. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, సహాయక చర్యలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించారు. 27 కోట్లకుపైగా జనాభా ఉన్న ఇండోనేషియాలో భూకంపాలు సంభవించడం సాధారణమే అయినప్పటికీ రాజధాని జకార్తాలో ప్రకంపనలు సంభవించడం అత్యంత అరుదని అధికారులు చెప్తున్నారు. 2004లో పసిఫిక్ మహా సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ వచ్చి 12 దేశాల్లో మొత్తం 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు కోల్పోగా మృతుల్లో ఎక్కువ మంది ఇండోనేసియా దేశస్థులే ఉన్నారు.