గోదావరి పరివాహక ప్రాంతంలో భూకంపం… తెలంగాణాలో కలకలం…

దిశ దశ, తెలంగాణ బ్యూరో:

తెలంగాణాలోని పలు జిల్లాల్లో భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక జిల్లాల్లోనూ  భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు ప్రాంతంలో భూమి కంపించింది. దాదాపు రెండు సెకన్ల పాటు భూకంపం సంభవించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు ప్రవహిస్తున్న గోదావరి తీరంలో స్వల్పంగా భూమి కంపించినట్టుగా సమాచారం. సింగరేణి గనులు విస్తరించిన ఏరియాల్లో కూడా భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా భూమిలో కదలికలు చోటు చేసుకోవడంతో ఇండ్లలో ఉన్న వారంతా కూడా బయటకు వచ్చి నిలుచున్నారు. భూకంపం సమయంలో జరిగిన కదలికలపై గోదావరి తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండతో పాటు పలు జిల్లాల్లోనూ భూకంపం వచ్చినట్టుగా సమాచారం.

చాలా కాలం తరువాత…

సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకున్న సందర్భాలు అత్యంత అరుదేనని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భూకంపం సంభవించినప్పటికీ ఉత్తర తెలంగాణలో పాత్రం సాధారణంగానే ఉంది. అయితే బుధవారం తెల్లవారు జామున భూమి కంపించడంతో స్థానికంగా భయాందోళనలకు నెలకొన్నాయి.

దక్షిణాన కూడా…

అయితే ఈ భూకంప ప్రభావం తెలంగాణాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం 7.25 గంటల ప్రాంతంలో హైదరాబాద్, మహబూబ్ నగర్ తో పాటు పలు జిల్లాల్లో కూడా దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై నమోదయిన పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

మహారాష్ట్రలో కూడా..? 

అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాతో పాటు విదర్భలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. 

You cannot copy content of this page