మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరే నేతల లిస్ట్ ప్రత్యర్థులకు లీక్ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్లు ముందే లీక్ కావడం ద్వారా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని, చేరకుండా ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలలోనూ కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టు ఉన్నారని ఈటల చెప్పడంతో.. బీజేపీలోనూ ఉన్నారనే చర్చ జరుగుతోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు 15 నుంచి 20 మందిని ఓండించేందుకు కేసీఆర్ కుట్రలు చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. తమను ఓడించేందుకు ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్స్ కమిటీ లేదని, బీజేపీలోనే ఇలాంటి కమిటీ ఉందని చెప్పారు. ఈ కమిటీ ఉండటంతో పార్టీలో చేరే నేతల పేర్లు ముందే ప్రత్యర్థులకు లీక్ అవుతున్నాయని ఈటల తెలిపారు. కోవర్టులుగా ఉన్నవాళ్లే జాయిన్ అయ్యేవారి పేర్లను బయటకు లీకులు ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల క్రమంలో ఈటల వ్యాఖ్యలు కాషాయ పార్టీల్లో ప్రకంపనలు రేపుతోన్నాయి.
2018లో తన నియోజకవర్గంలో కొంతమంది చిల్లరగాళ్లను కేసీఆర్ పెట్టుకున్నాడని, డబ్బులిస్తే వాళ్లు తనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారని ఈటల విమర్శించారు. తన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చారని, తనను ఓడించాలని ప్రయత్నం చేసినట్లు చెప్పారు. కానీ తన వెనుక ప్రజలు నిలబడి గెలిపించుకున్నారని, తనపై కొన్ని పత్రికల్లో అసత్య వార్తలు కూడా కేసీఆర్ రాయించినట్లు తెలిపారు. కేసీఆర్ ఎవరికీ తెలియకుండా అన్ని పార్టీలలో ఇన్‌ఫార్మర్లను పెట్టుకుంటారని ఈటల స్పష్టం చేశారు.
తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఈటల రాజేందర్ చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి 13 నెలలు అవుతున్నా. నియోజకవర్గంలో ఒక్క అధికారిక కార్యక్రమం కూడా లేదని చెప్పారు. తెలంగాణలో ఇంటెలిజెన్స్ విభాగం క్రైమ్ లపై దృష్టి పెట్టడం మానేసి ప్రత్యర్థి పార్టీలపైనే ఉంటుందని అన్నారు.