దిశ దశ:, హైదరాబాద్:
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. ఇంత కాలం దోబూచులాడుకుంటూ వస్తున్న అరెస్ట్ కథకు శుక్రవారం ఈడీ ఎట్టకేలకు ముగింపు పలికింది. ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారులు మద్యాహ్నం నుండి కవితను విచారించి చివరకు అమెకు అరెస్ట్ నోటీసు ఇచ్చారు. అయితే కొంతమంది న్యాయవాదులు కూడా కవిత ఇంటికి చేరుకుని ఈడీ అధికారుల చర్యలపై అభ్యంతరం తెలిపినప్పటికీ వారు విననట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కవిత సంబంధించిన మొబైల్స్ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈడీ కూడా కవితను విచారించేందుకు నోటీసులు ఇవ్వగా ఆమె హాజరు కూడా అయింది. తన విచారణపై సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆమె విచారణ కొనసాగుతోంది. శుక్రవారం నాటి విచారణ 19కి వాయిదా పడింది. అయితే ఇప్పటికే కవిత పేరును ఛార్జిషీట్ లో నిందితురాలిగా కూడా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ మాత్రం సుప్రీం కోర్టు విచారణ తరువాతే ఏదైని చర్య తీసుకుంటుందని అప్పటి వరకు కవిత ఎపిసోడ్ హోల్డ్ లోనే ఉంటుందని భావించారంత. కానీ అనూహ్యంగా శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడించడం సంచలనంగా మారింది. కవిత నుండి మొత్తం 16 ఫోన్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం.