ఈడీ తొందపడిందా…?

కవిత ఫోన్ల వ్యవహారం…

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం తాను గతంలో వాడిన 10 మొబైల్ ఫోన్లను తీసుకెళ్లిన కవిత ఈడీ విచారణ అధికారికి అప్పగించారు. కవిత ఫోన్లను అప్పగించడంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందనే చెప్పాలి. ఇంతకాలం కవిత ఫోన్లను ధ్వంస చేశారని ఈడీ చెప్తుండడం, ఇంతవకూ ఫోన్లు వెలుగులోకి రాకపోవడంతో నిజమనే నమ్మారంతా. అయితే కవిత మాత్రం ఆ ఫోన్లన్ని తనవద్దే ఉన్నాయని మీడియా ఇంటర్వ్యూల్లో చెప్తూ వచ్చారు. కానీ ఎవరు ఈ విషయాన్ని నమ్మలేదు కానీ మంగళవారం గతంలో కవిత వాడిన మొబైల్ ఫోన్లను సేకరించి వాటిని ఈడీకీ అప్పగించారు. దీంతో ఫోన్ల వ్యవహారం ముగిసినట్టా లేక ఈడీ ఏం చేయనుందన్నదే చర్చకు దారి తీస్తోంది.

కవిత ఆరోపణలతో ఈడీ డిఫెన్స్…?

తాజాగా మంగళవారం ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు కూడా ఈడీ అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. మహిళనని, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిని కావడం వల్లే ఈడీ రాజకీయ ఒత్తిళ్లతో తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు ఈడీని డిఫెన్స్ లో పడేసే విధంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత కాలం పోన్లను ధ్వసం చేశారని చెప్తున్న ఈడీకి ఝలక్ ఇస్తున్నట్టుగా కవిత చెప్పకనే చెప్పారు. రెండు కవర్లలో మొబైల్ ఫోన్లను తీసుకెల్తూ తాను గతంలో వాడిన ఫోన్లు ఇవేనంటూ ప్రదర్శించారు. ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీలు కూడా కవిత ఫోన్లు ధ్వంసం చేశారని కారణాలు ఏంటని పదే పదే ప్రశ్నించాయి. అయితే కవిత ఈడీకీ ఫోన్లు అందించిన తరువాత ఇంతకాలం కవిత ఈ ఫోన్లను పగలగొట్టారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కేంద్రంలో అధికార బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఆమె విడుదల చేసిన లేఖలో చేసిన వ్యాఖ్యలు కూడా సరికొత్త చర్చకు దారి తీశాయి.

ఈడీ ఎలా ఇలా..?

ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికార యంత్రాంగం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి లోతుగా దర్యాప్తు చేస్తుంది. అయితే కవిత ఇంతకాలం వినియోగించిన ఫోన్ల విషయంలో ఈడీ తొందరపడిందా అన్న అనుమానం రేకెత్తుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని అభియోగాలు మోపే విధానానికి భిన్నంగా ఈడీ ఇలా ఎలా చేసిందన్నదే అంతుచిక్కకుండా పోతోంది. మొత్తం 170 ఫోన్లను లిక్కర్ స్కాంలో వినియోగించారని అయితే అందులో కేవంలో 17 మాత్రమే ట్రేస్ అయ్యాయని మిగతవన్ని కూడా సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు ధ్వంసం చేసి ఉంటారన్న అనుమానాలను కూడా వ్యక్తం అయింది. అయితే ఇప్పుడు కవిత తాను ఇప్పటి వరకు వినియోగించిన 10 ఫోన్లను అప్పగించడంతో ఈడీ మొబైల్ ఫోన్ల ఆధారంగా చేపట్టిన దర్యాప్తును శంకించాల్సి వస్తోంది. కాల్ డాటా రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా ఇన్ కమింగ్ ఔట్ గోయింగ్ కాల్సే కాకుండా వారు ఏఏ ప్రదేశాల్లో ఎంత సేపు ఎంతెంత దూరంలో ఉన్నారన్న విషయాన్ని మ్యాపులతో సహా తెలుసుకునేంత టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా ఇదే విధంగా ఈడీ దర్యాప్తు చేసి ఉంటుందని ఇంతకాలం భావించినప్పటికి అనూహ్యంగా కవిత తన ఫోన్లను ఈడీకి డిపాజిట్ చేయడంతో కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నట్టయింది.

కిం కర్తవ్యమ్..?

అయితే మంగళవారం కవిత ఇచ్చిన మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న తరువాత వాటి ఐంఎంఈఐ నెంబర్లను చెక్ చేసుకోనున్నారు ఈడీ అధికారులు. ఆ తరువాత వాటిని స్కాన్ చేసినప్పుడు కవితకు వినియోగించినప్పుడు అందులో రికార్డ్ చేసిన డాటా రికవరి చేయనున్నారు. అందులో కవిత వినియోగించిన సమయంలోని వాట్సప్ ఛాటింగ్ కావచ్చు. ఇమేజెస్ కావచ్చు, వీడియో రికార్డ్స్ కావచ్చు, ఫోన్ బుక్ కావచ్చు ఇలా ఆమె వినియోగించిన ప్రతి అంశానికి సంబందించిన విషయాలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఎక్కడ కూడా గతంలో కవిత వినియోగించినట్టు ఆధారాలు దొరకనట్టయితే మరో కోణంలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థలు విచారించే అవకాశాలు ఉంటాయి. ఐంఎంఈఐ నెంబర్లు ఇప్పటికే ఈడీ వద్ద ఉండడంతో అప్పుడు వాడిన మొబెల్ ఇప్పుడు కవిత డిపాజిట్ చేసిన మొబైల్ ఒకటేనా అన్న వివరాలను కూడా క్రాస్ చెక్ చేస్తుంది ఈడీ. వీటిలో కవిత గతంలో చేసిన ఛాటింగ్స్ కావచ్చు ఇతర రకాలుగా మొబైల్ ఆధారంగా జరిగిన ఎలాంటి ఆనవాల్లు దొరకనట్టయితే ఈడీ ఎలా వ్యవహరిస్తుందన్నదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

You cannot copy content of this page