ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా…

‘‘కెయిమ్స్’’ లో సోదాలు జరిపిన టీమ్

దిశ దశ, వరంగల్:

కాళోజీ నారయణ రావు మెడికల్ యూనివర్శిటీ(KNRUHS) పరిదిలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా ఝులిపించింది. పీజీ సీట్ల గోల్ మాల్ కు సంబంధించి యూనిర్శిటీ ప్రతినిధులు మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో వివిధ డాక్యూమెంట్లు సేకరించిన హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చిన ఈడీ అదికారులు వాటి ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు. తాజాగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై చర్యలకు పూనుకున్నాట్టు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మనీలాండరింగ్ విచారణలో భాగంగా రూ. 5 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేశామని ఈడీ వెల్లడించింది. కరీంనగర్ సమీపంలోని చల్మెడ ఆనందరావు ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన రూ. 3.33 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లను, ఎంఎంన్ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన రూ. 2.01 కోట్ల డిపాజిట్లను మనీలాండరింగ్ యాక్ట్(PMPL)  ప్రకారం మొత్తంగా రూ. 5.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేశామని ఈడీ ప్రకటించింది. గతంలోనే మల్లారెడ్డి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన రూ. 1.47 కోట్లు స్వాధీనం చేసుకోగా రూ. 2.89 కోట్ల బ్యాంకు డిపాజిట్లను కూడా స్తంభింపజేసింది ఈడీ. ఇప్పటి వరకు మొత్తం రూ. 9.71 కోట్ల ఆస్తులు, డిపాజిట్లను ఈడీ అటాచ్‌మెంట్ చేసినట్టయింది. KNRUHS రిజిస్ట్రారర్ మేనేజ్‌మెంట్ కోటా కింద పిజి మెడికల్ అడ్మిషన్ల సీట్లను నీట్, పీజీల్లో మెరిట్ సాధించిన విద్యార్థుల అభ్యర్థిత్వాన్ని ఉపయోగించుకుని బ్లాక్ చేస్తున్నారని మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు యూనివర్శిటీలో మేనేజ్ మెంట్ కోటా కింద దరఖాస్తు చేయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొందని ఈడీ వివరించింది. ఇందులో భాగంగా దర్యాప్తు చేయగా కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు, మధ్యవర్తులు కుమ్మక్కై అత్యున్నత ర్యాంకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఉపయోగించి సీట్లను బ్లాక్ చేశారని దర్యాప్తులో తేలింది. బ్లాక్ చేసిన సీట్లు చివరి కౌన్సిలింగ్ వరకు అలాగే ఉంచి తరువాత విద్యార్థులు అడ్మిషన్ తీసుకోకుండా వెల్లిపోయారని వారికి యూనివర్శిటీ విధించిన జరిమానా చెల్లించనట్టుగా చూపుతున్నారని ఈడీ పేర్కొంది. ఈ పెనాల్టీ మొత్తాన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సొంతగా చెల్లించేందుకు నేరుగా ఆయా కాలేజీల బ్యాంకు అకౌంట్ల ద్వారా కానీ మధ్యవర్తుల ద్వారా కానీ చెల్లించే విధానాన్ని అవలంభించారని ఈడీ వెల్లడించింది. ఈ సీట్లను ఖాళీగా చూపించిన యాజమాన్యాలు వాటిని ఫ్రీ వెకెన్సీ సీట్లుగా మార్చి తమకు నచ్చిన వారికి అలాట్ చేస్తున్నాయని గుర్తించింది. ఇనిస్ట్యూషనల్ కోటా సీట్లతో సమానంగా పొందే బ్లాక్ చేసిన సీట్లను విద్యార్థులకు కెటాయించినప్పుడు సాధారణ ఫీజుకు మూడు రెట్ల రెట్టింపు ఫీజు వసూలు చేస్తున్నారని ఈడీ అభిప్రాయపడింది. విద్యార్థుల నుండి ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న క్యాపిటేషన్ ఫీజును నగదు రూపంలోనే వసూలు చేస్తున్నాయని ఈడీ గుర్తించింది. ఉద్దేశ్యపూర్వకంగా బ్లాక్ చేయబడిన రెగ్యూలర్ మేనేజ్ మెంట్ కోటా కేటగిరీ ఫీజులకు మించి వసూలు చేస్తున్న ఫీజులు, క్యాపిటేషన్ ఫీజులు నేర పూరితమైన రాబడి కిందకే వస్తుందని ఈడీ స్పష్టం చేసింది. మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల బ్లాక్ దందా వ్యవహారంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని కూడా హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం ఆ ప్రకటనలో వెల్లడించింది.

కరీంనగర్ లో…

ఇటీవల రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలతో పాటు కరీంనగర్ లోని కెయిమ్స్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు అధికారుల బృందం బొమ్మకల్ లోని చల్మెడ మెడికల్ కాలేజీలో రికార్డులను తనిఖీ చేసినట్టు సమాచారం.

You cannot copy content of this page