మాగుంట రాఘవకు 10రోజుల ఈడీ కస్టడీ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం విధాన రూపకల్పనలో రూ.100 కోట్లు చేతులు మారాయని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. సౌత్‌ గ్రూప్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి కీలక వ్యక్తుల ద్వారా పంపించారని తెలిపింది. మాగుంట రాఘవకు తయారీ, హోల్‌సేల్‌ వ్యాపారం, రెండు రిటైల్‌ జోన్స్‌ కూడా ఉన్నాయని ఈడీ వివరించింది. తదుపరి విచారణ కోసం మాగుంట రాఘవను కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ కేసులో ఇప్పటికే శరత్‌ చంద్రారెడ్డి, విజయ్‌నాయర్‌, అభిషేక్‌, సమీర్‌, అమిత్‌ అరోరా, బినోయ్‌ అరెస్ట్ అయ్యారని ఈడీ పేర్కొంది. శరత్‌ రెడ్డితో రాఘవకు మంచి సంబంధాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. ముడుపుల సమీకరణలో సమీర్‌ మహేంద్ర్ కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఇండో స్పిరిట్‌ కంపెనీలో రాఘవకూ భాగస్వామ్యం ఉందని.. దీని నుంచి ఆయనకు వాటా వెళ్తోందని పేర్కొంది. మద్యం విధానంతో లబ్ధి పొందేందుకు ముడుపులు ఇచ్చారని.. ఈ ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని కోర్టుకు వివరించింది.

ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో వివరాలు పొందుపరిచామని కోర్టుకు తెలిపింది. సుమారు 30మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది. ఇంకా రూ.30 కోట్లకు సంబంధించిన వివరాలు తీసుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో రాబట్టాల్సిన ఆధారాలు, వివరాలు చాలా ఉన్నాయని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

ఈడీకి అరెస్ట్ చేసే అధికారం లేదని మాగుంట రాఘవ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ ఏర్పడిన ప్రత్యేక చట్ట ప్రకారం అరెస్టుకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అరెస్టు చేస్తూ కనీసం దాఖలు చేసిన అప్లికేషన్‌ ఇవ్వలేదని.. రిమాండ్ అప్లికేషన్‌ కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై అభ్యంతరం తెలిపిన ఈడీ తరఫు న్యాయవాది అరెస్టు చేస్తున్నట్లు నిందితుడికి ముందుగానే చెప్పినట్లు పేర్కొన్నారు. నిందితుడి సంతకాలు తీసుకున్న తర్వాతే కస్టడీలోకి తీసుకున్నట్లు వివరించారు.

You cannot copy content of this page