ఈసీఐఆర్ నమోదు
దిశ దశ, హైదరాబాద్:
జాతీయ దర్యాప్తు సంస్థలు మరో సారి తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించాయి. అయితే ఈ సారి పొలిటికల్ పార్టీలకు సంబంధం లేకుండా ఉన్న ఓ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఈసీఐఆర్ కూడా జారీ చేసిన ఈడీ మనీ ల్యాండరింగ్ జరిగిందా అన్న కోణంలో విచారణ జరపనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ముఠాగా ఏర్పడి పర్సనల్ డాటా సేకరించి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముఠా గుట్టు తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుండి సిస్టమ్స్ తో పాటు పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరు దేశం మొత్తంమీద 16 కోట్ల మంది డాటా సేకరించగా కొంతమంది వివరాలను వేరే వారికి విక్రయించినట్టు కూడా సైబరాబాద్ పోలీసుల విచారణలో తేలింది. ఈ సమాచారం అందుకున్న ఈడీ రంగంలోకి దిగి ఈ మేరకు ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ డాటా చౌర్యం వెనక మనీలాండరింగ్ జరిగిందా లేదా అన్న కోణంలో ఆరా తీయనుంది. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుని ఈడీ విచారించడంతో పాటు సాంకేతికతను కూడా ఆధారం చేసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. దేశ వ్యాప్తంగా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన ఈ ముఠాలు ఎవరికి విక్రయించారు, వారు ఏం చేస్తున్నారు అన్న వివరాలను కూడా తెలుసుకోనుంది.