దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మళ్లీ ఈడీ నోటీసులు అందుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు ఈ నోటీసులు ఇవ్వడం వరసగా ఇది నాలుగోసారి. ఇప్పటి వరకు అందుకున్న నోటీసులకు స్పందించి కేజ్రీవాల్ మాత్రం ఈడీ విచారణకు హాజరు కాలేదు. మూడో సారి నోటీసు అందుకున్నప్పుడు కూడా పట్టించుకోకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ ఆప్ పార్టీ వర్గాలు అనుమానించాయి. ఇందులో భాగంగా కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీసు వద్ద ఢిల్లీ స్టేట్ పోలీసు బలగాలను మోహరించారు. తాము అరెస్ట్ చేసే ఆలోచనలో లేమని ఈడీ అధికారులు ప్రకటించారు. తాజాగా మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ కోసం ఈ నెల 18న హాజరు కావాలని ఈడీ అధికారులు ఆ సమన్లలో పేర్కొన్నారు. అయితే ఈ సారైనా విచారణకు హాజరు అవుతారా లేదా అన్న విషయంపై ఢిల్లీ సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.