ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..?

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని గురువారం నోటీసులు జారీ చేశారు. అరుణ్ పిళ్లై అప్రూవర్ గా మారిన వెంటనే కవితను విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ లో ఒక్కొక్కరు అప్రూవర్ గా మారుతున్న నేపథ్యంలో కవితను మళ్లీ విచారించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా కవితను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకున్నప్పటికీ విచారణతోనే సరిపెట్టడంతో అరెస్ట్ ప్రక్రియ లేదని తేలిపోయింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఈడీ పలు చార్జిషీట్లలో పేర్కొనడంతో పాటు ఆమె సెల్ ఫోన్లు ధ్వంసం చేసి ఆధారాలు దొరకకుండా చేశారని కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఈడీ అధికారులకు సెల్ ఫోన్లు అప్పగించారు. ఆ తరువాత కవిత ఎపిసోడ్ లో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వాదనలు కూడా వినిపించాయి. బీజేపీ నాయకులు కూడా కవిత విషయంలో సమాధానాలు చెప్పలేని పరిస్థితి కూడా తయారైంది. తాజాగా మళ్లీ కవితకు నోటీసులు ఇవ్వడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా కవిత అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతుండడం… సౌత్ గ్రూపునకు చెందిన వారు అప్రూవర్ గా మారుతుండడం వెనక ఉన్న కారణాలు ఏమిటోనన్నది కూడా అంతుచిక్కకుండా పోయింది. ఈ క్రమంలో అరుణ్ పిళ్లై అప్రూవర్ అయిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు రావడం సంచలనంగా మారిందని చెప్పాలి.. అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలం ఆధారంగా ఈడీ విచారించి సరిపెడుతుందా లేక… ఆమె గతంలో ఈడీకి అప్పగించిన మొబైల్స్ ను పరిశీలించి టెక్నికల్ ఎవిడెన్స్ లను సేకరించిన అంశాల గురించి కూడా ఆరా తీస్తుందా అన్న విషయంపై స్పష్టత రావడం లేదు.

You cannot copy content of this page